'వేష ధారణలలో పురుషులతో సామ్యమును ఆశించలేదు. శాసనసభలలో సమాన
హక్కు కోసం పోరాడి పొందలేదు' అన్నమాట.
కేవలం ఇటువంటి స్వేచ్ఛా సౌఖ్యాలను కోరటమే కాకుండా వివాహం వలన కామతృప్తి (Sexual Satisfaction) ని కూడా వాంఛిస్తున్నారు. పురుషునివలె శారీరకమైన వైవాహిక జీవనంలో వారూ కోరికలు పెంచుకున్నారు. అందువలన వారికి ఆశాభంగము అత్యధికంగా కలుగుతున్నది. వారిలో ఒకవిధమైన శృంగారిక కాఠిన్యము (Mosachistic Tendency) ఏర్పడినది. అందువలన వారు శుక్లస్యందనము విసృష్టి (Orgasm) సంబంధమైన సౌఖ్యాన్ని పొందలేకపోతున్నారు. నేటి స్త్రీకి ఆదర్శలగు అమెరికా యూరప్ దేశ స్త్రీలు (Euro - American women) నూటికి నలుబదిమందియైనా సాంప్రయోగిక సౌఖ్యాన్ని పొందలేకపోవటం జరుగుతున్నదని వాన్డినెల్డి, స్టెకెల్, మేరీ స్టోవ్సు మొదలగు రచయితల వ్రాతలవల్ల తెలుస్తూ ఉన్నది. అంటే ఆధునిక స్త్రీ వైవాహిక జీవనంలో ఎంతటి ఆశాభంగాన్ని పొందుతున్నదో దీనివల్ల అర్థమౌతుందన్నమాట.
ఈ రీతిగా స్వేచ్ఛా సామ్యాలను సంపాదించుకొనిన ఆధునిక స్త్రీలలో గృహజీవనమును నెరపుటకు పురాతన మర్యాదల ననుసరించు భర్త పనికిరాడు. నూతనభర్త కావలసి వున్నాడు. పురుషుడు పూర్వం వలె ఒక చక్కని గృహాన్ని చూపించి సాధన సంపత్తి నిచ్చి ఇంతటితో తృప్తి చెందమని చెప్పే దినాలు పోయినవి. అతనికి ఏ విధమైన అంగవైకల్యం ప్రాప్తించినా అది నన్నేమి బాధపెడుతుందని ఇకముందు స్త్రీ తృప్తి వహించదు.
ఇంతకు పూర్వం స్త్రీ పురుష సంయోగం కేవలము ఏకపాత్రాభినయం (Solo). స్త్రీ ద్వితీయ పాత్ర వహించేది. ఈ నాడు అది వాకో వాక్యము (Duet). శృంగారిక రంగస్థలంమీద ఇద్దరూ సమానంగా పాత్ర నిర్వహణం చేస్తున్నారు. అందువల్ల కలిగే లాభనష్టాలకు ఇద్దరూ సమాన బాధ్యత వహిస్తున్నారన్నమాట!
నేటి వధూవరులలో కలుగుతున్న నూతన భావాలు ఒకరీతిగా విజయ వంతమైన వివాహ బంధాలు ఏర్పరుస్తున్న మాట వాస్తవము. కానీ అంతకంటే అధికంగా విజయరహిత వివాహాలను నిరూపిస్తూ ఉన్నవి. స్త్రీ పురుషుల మధ్య కామసంబంధమైన తౌర్యత్రికము (Harmony) కుదరకపోవటానికి ముఖ్యకారణము కామకళా విషయికమైన అజ్ఞానము. కేవలమూ అజ్ఞానము కంటే అపమార్గాన్ని అనుసరించే కించిద్ జ్ఞానము విశేషమైన అజ్ఞానము. ఇందువల్ల కూడా వివాహ బంధాలు విజయవంతాలు కాకపోవటం జరుగుతుంది. ____________________________________________________________________________________________________
242
వావిలాల సోమయాజులు సాహిత్యం-4