పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


(Mutual Devotion) వైవాహిక విజయానికి ఇరువురు వ్యక్తులకూ పరస్పర గౌరవాదరణలు (Admiration of Personalities) ఉండి తీరాలి.

వైజ్ఞానిక, ఉద్వేగ, శారీరకములలో శారీరకానికి విశేష ప్రాధాన్యం లేకపోలేదు. వైవాహిక జీవనంలో శారీరకమైన అసంతృప్తి వధూవరులకు కలుగకుండా ఉండటానికే ప్రాచ్య పాశ్చాత్య లోకాలలో కామకళావేత్తలూ, వైద్యశాస్త్రజ్ఞులూ మానవ జాతి విభజన మొనర్చినారు, సాంప్రయోగిక వైవిధ్య (Modus Sexualis) మును నిరూపించినారు. భావరాగ లక్షణ నిరూపణ మొనర్చినారు. పూర్వరతి (Love-play) స్వరూపమును వెల్లడించినారు.

వైవాహిక జీవన విధానంలో స్త్రీలు విశేషంగా ఆశాభంగం ఎందుకు పొందుతారో చెప్పవచ్చును. వివాహబంధంలో స్త్రీ పురుషుని కంటే కొంత విశేషాన్ని ఆశిస్తుంది. ఆమె స్వప్నాదర్శాలకు ఏ మాత్రం విభిన్నత గోచరించినా ఆశాభంగం పొందుతుంది. పురుషుడు స్త్రీవలె గృహ విషయాన్ని విశేషంగా పట్టించుకోడు. అతని దృష్టి గృహేతరమైన బాహ్య ప్రపంచం మీద లగ్నమై ఉంటుంది. అందుమూలంగా వైవాహిక ఛిద్రాలకు స్త్రీవలె అతను నిస్పృహ వహించడు.

ఆధునిక స్త్రీ మానసిక స్థితీ, దృక్పథమూ, మార్పు పొందాయి. అందువల్లనే నేడు స్త్రీ విశేషమైన వైవాహికాశాభంగాన్ని పొందుతున్నది. మున్ముందు ఇది ఇంకా విపరీత స్థితిని పొందబోతున్నదని విజ్ఞుల అభిప్రాయము. ప్రాచీన కాలంలో భార్యాభర్తలిద్దరికీ వివాహం ఒక పవిత్ర కర్మ. అందువల్ల స్త్రీ పురుషులిరువురూ వివాహమంటే జంకేవారు కారు. ఏ కారణం చేతనైనా వైవాహికచ్ఛిద్రం ఏర్పడితే దానిని కేవలం విధివిలాసంగా భావించేవారు. ప్రాచీన మానవ సంఘాలు ఈ దృష్టితో వివాహాన్ని గుర్తించేవి. మతపీఠాలూ, పీఠాధిపతులూ ఈ నిశ్చయంతోనే నాటి వివాహాలను ఆమోదించేవారు.

ప్రాచీన వివాహం మీద మొదట పురుషుడు తిరుగుబాటు ప్రారంభించాడు. జీవత సహచరిని ఎన్నుకునే విషయంలో కొంత స్వేచ్ఛను ఆశించాడు. ధర్మశాస్త్రాను సారమైన వైవాహిక జీవనం వలన ఆత్మతృప్తి లేదనీ, వివాహ మూలముగా వైయక్తిక సౌఖ్యము (Personal Stisfaction) లభించవలెననీ, అదే ప్రాప్యమనీ వారు వాదించారు. పురుషులు ఇటువంటి విప్లవ మార్గాలను త్రొక్కటము ఏ నాడో ప్రారంభించినా, స్త్రీలు సాంఘికోన్నతి, ఉజ్జ్వల గృహమూ తప్ప తదితరాలను కోరకుండా వివాహాలు నేటివరకూ చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రత్యేక స్త్రీ ప్రణయము కనిపించలేదన్నమాట! ____________________________________________________________________________________________________

సంస్కృతి

241