Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వివాహము - జయాపజయాలు

మానవ వైవాహిక జీవన ప్రవాహము గంగానది వంటిది. ఇందు వైజ్ఞానిక (Intellectual) ఉద్వేగ (Emotional) ములను యమునా సరస్వతుల సంగమమున్నది. శారీరకమైన కామము (Physical passion) మూల ప్రవాహము. ఈ త్రివిధములైన నదులకూ ఒకవిధమైన లయ, కుదిరినప్పుడే భార్యాభర్తల వైవాహిక జీవన స్రవంతికి ఆనంద మహాసాగర సంయోగం కలుగుతుంది.

అంటే భార్యభర్తలకు శారీరకమైన పరస్పరాకర్షణమూ, అన్యోన్యమూ ఉండి, ఇరువురూ వైజ్ఞానికమైన ఏకస్థితిని పొంది, ఉద్వేగ విషయకమైన ఉన్నత బంధంతో సామ్యము కలిగియుండవలెనని అభిప్రాయము.

స్త్రీ పురుషులిద్దరిలో ఏ ఒకరో వైజ్ఞానిక, ఔద్వేగికాలైన మానసిక బాధలను అనుభవిస్తుంటే అది ఆ వ్యక్తి సహచర, సహచరీ వైవాహిక సౌఖ్యానికి భంగం కలిగిస్తుంది. వివాహ బంధము కేవలమూ అల్పమైన శారీరక శృంగార బంధము (Sexual Erotic Union) కాకపోవుటయే దీనికి కారణము. అందుకనే మానవజాతి శాస్త్రజ్ఞుడు ఎల్లిస్ మహాశయుడు 'ఉదాత్తమూ ఉత్తమమూ అయిన వివాహము కేవలం శారీరక భోగ తృష్ణను తీర్చుకోటంతో ఆగిపోదు. వాటికి భిన్నమైన అనేక బంధాలతో ఇది భార్యాభర్తలను అనువశులను చేస్తుంది. అందువల్ల ఇరువురికీ అభిరుచులూ, ఆదర్శాలూ ఏర్పడుతవి; సహజీవన మర్యాదలు ఏర్పడుతవి; మాతా పితృత్వబంధమూ ఆర్థిక బంధమూ ఏర్పడుతవి' అని అభిప్రాయ మిచ్చాడు. ప్రాచ్య కామ కళా విజ్ఞాని వాత్స్యాయన మహర్షి ఆదిలో శారీరక ప్రతిపత్తిని గురించి విశేషముగ పలికినాడు గాని, త్రివర్గములలో పరస్పరానుఘాతంగా కామాన్ని సేవించాలెనని నిర్దేశించాడు. ఈ రీతిగా ప్రాచ్య పాశ్చాత్య జాతి శాస్త్రజ్ఞులందరూ వైవాహిక జీవితంలో ఉన్న ఈ త్రివేణీ సంగమాన్ని గుర్తించారు.

యౌవనారంభ దశలో భార్యాభర్త లిరువురి మధ్యా శారీరక శృంగార భావం కొంత విశేషంగానే ఉంటుంది. అది కాలక్రమేణా నశించిపోయినా అనేకులలో వైవాహిక బంధం ప్రిదిలిపోవటం లేదు. దీనికి ముఖ్యకారణము పరస్పర ప్రీతిభావం

240

వావిలాల సోమయాజులు సాహిత్యం-4