Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నియమించారు. తాతలకు సంబంధించిన వారందరూ భర్తృవంశం వారైనారు. ఆ విధంగా వివాహం చేసుకున్నవారివల్ల కలిగే సంతానాలమూలంగా భర్తృవంశాలవారూ, భార్యవంశాలవారూ ఏర్పడి ఉంటారు.

ఈ విధంగా ఏర్పడ్డ వివాహ సంస్థలో పూర్వికులకూ, వారిసంతానంతో వైవాహిక సంబంధము ఉండటానికి అవకాశం లేదు. ఆ నాటి వైవాహికమంటే కేవలమూ రతీత్యాదులు మాత్రమే - కేవలమూ కామోపభోగము. ఇటువంటి స్థితిలో అన్నకు చెల్లెలు భార్య కావచ్చును. అక్కకు తమ్ముడు భర్త కావచ్చును. ఈ విధమైన వైవాహిక పద్ధతిని నిరూపించే జాతి నేటి ప్రపంచంలో ఎక్కడా కనిపించటం లేదు. అయితే ఇటువంటి వివాహ క్రమము ఒకానొక కాలంలో తప్పకుండా ఉండి ఉంటుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడినారు. తరువాత కాలంలో అన్నదమ్ముల మధ్యా అక్కచెల్లెళ్ళ మధ్యా ఉండే ప్రణయాన్ని అరికట్టినారు. క్రమంగా పినతండ్రి పెత్తండ్రి బిడ్డల మధ్యా, పినతల్లీ పెత్తల్లి బిడ్డల మధ్యా ఉండే వైవాహిక సంబంధం కూడా తొలగిపోయింది. అందు మూలంగా అన్నదమ్ములు ఒక సంసారానికి సంబంధించినవాళ్ళూ, అక్కచెల్లెళ్లు ఒక సంసారానికి సంబంధించినవాళ్ళూ అయినారు. ఈ సంబంధం ఏకోదరులు విషయంలోనే కాదు - వేలు విడిచినవారైనా సరే - మరికొంత దూరమైనా సరే. ఈ విధంగా తరువాతి కాలంలో సంసారాలు ఏర్పడ్డవి. ఇటువంటి సంసారాలను శాస్త్రజ్ఞుడు మోర్గన్ 'పునలీయన్ సంసారా' అన్నాడు.

పునలీయన్ సంసారాలలో ఎన్ని మార్పులతోనైనా వివాహం జరగటానికి అవకాశమున్నది. కాని ప్రధానంగా ఒక కులంలోని స్త్రీలందరూ జన్మతః ఆ కులంలోని పురుషులందరికీ భార్యలై ఉంటారు. అయితే వారి సంబంధము సోదర సోదరీ సంబంధము కాకూడదు.

ఈ సంసారాలలోని వివాహ విధానాన్ని పరిశీలించి చూస్తే ఏర్పడే సంబంధ బాంధవ్యాలు ఈ క్రింది విధంగా ఉంటవి. రామన్న అమ్మ చెల్లెలి బిడ్డలందరూ రామన్న తల్లి బిడ్డలు. రామన్న తండ్రి తమ్ముని బిడ్డలందరూ రామన్న తండ్రి బిడ్డలు. రామన్న పినతల్లి భర్తలందరూ రామన్న తల్లికి భర్తలు. రామన్న తండ్రి తమ్ముని భార్యలందరూ రామన్న తండ్రికి భార్యలు.

అన్న తమ్ముళ్ళకూ, అక్కచెల్లెళ్ళకూ మధ్య వైవాహిక సంబంధం నిషేధితం కావటంతో, మానవజాతి వైవాహిక విధానంలో మరొక మార్పు వచ్చింది. ఈ మార్పు రెండు విధాలుగా రూపొందింది. 1 ____________________________________________________________________________________________________

సంస్కృతి

231