పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాథలిక్కులు హెరిటిక్కుల మధ్య వివాహాలు పనికి వస్తాయని క్రైస్తవ సంఘం అంగీకరించింది. వారు క్రైస్తవ మతాన్ని అంగీకరించవలసి ఉంటుందన్నారు. కొన్ని క్రైస్తవ పరిషత్తులలో దీనికి వ్యతిరేకంగా తీర్మానించారు. ఇటువంటి వివాహాలకు మతప్రవక్తల అనుమతి అవసరమన్నారు. అటువంటి వివాహాలు మతవక్తల ముందు జరిగితే తప్ప అంగీకరణయోగ్యాలు కావని ట్రెంటులో జరిగిన పరిషత్తు తీర్మానించింది. కానీ కాలక్రమేణ 'పోపులు' ధర్మాంతర వివాహాలను (Mized Marraiges) అంగీకరించారు. పుట్టే సంతానము పొందే విద్యాదికాలను జూచి చర్చి అసహ్యించు కున్నది. ప్రొటెస్టెంట్లు మొదట ధర్మాంతర వివాహాలను వ్యతిరేకించారు గాని, క్రమక్రమంగా ఆమోదించారు. ఈ వివాహాలు ఈ నాడైనా రోమను కాథలిక్, ప్రొటెస్టెంటు దేశాలలో చట్టసమ్మతాలైన వివాహాలకు (Legal marriage) భిన్నంగా లేవు. గ్రీసు దేశానికి సంబంధించిన చర్చి వారిలో మతసంంధమైన నిబంధనలు ఈ నాటికీ కొంతవరకు కనిపిస్తూ ఉన్నవి.

అంతర్వివాహాన్ని ఇస్లాంమతం మొదటినుంచి ఈ నాటివరకూ అరికడుతూ వచ్చింది. 'ఇస్లాం మతధర్మాన్ని స్వీకరించని స్త్రీని వివాహమాడవద్దని' కొరాను పలుకుతున్నది. ఇస్లాం మత ధర్మాన్ని స్వీకరించినంత మాత్రంతో సరిపోదు. ఆ ముసల్మాను ధర్మశాస్త్రాల మీద ఆస్థ కలిగి ఉండాలి; నమ్మకము కుదిరినదై ఉండాలి.

ఈ మూలసిద్ధాంతాలను ఆధారం చేసుకొని సున్నీ షియ్యా న్యాయ శాస్త్రవేత్తలు కొన్ని నిబంధనలు చేశారు. ఈ రెండు వర్గాలవారూ విగ్రహారాధనం చేసే జాతుల్లోని స్త్రీలను వివాహం చేసుకోకూడదని అనుశాసించారు. దీనిని బట్టి ఎటువంటి సందర్భంలోనూ మహమ్మదీయ స్త్రీగాని, పురుషుడు గానీ ధర్మాంతర వివాహాన్ని చేసుకోటానికి అవకాశం ఆ ధర్మ శాస్త్రజ్ఞులు కల్పించలేదని వ్యక్తమౌతున్నది.

హిందువులలో కూటబాహ్య వివాహము - స్థూలదృష్ట్యా స్వీకరించినప్పుడు జరగటానికి వీలు లేదు. హిందూ జాతిలోని వర్ణ వ్యవస్థకు మూలాధారము అదే. హిందువులలో కూటాంతర వివాహమే ప్రధానధర్మము.

అయితే, అది కేవలము ఒక వర్ణముతోనే ఆగిపోలేదు. ప్రతి వర్ణములోనూ కొన్ని ఉపవర్ణములు (Sub-castes) ఏర్పడినవి. సర్వసాధారణముగా వివాహము ఉపవర్ణ, ఉపవర్గముల మధ్యనే నిలచిపోతుంది. ఎప్పుడైనా, వర్ణాంతర, వర్గాంతర వివాహాలు ఉపవర్గాలమధ్య జరగవచ్చునేమో కాని అనాదిలో ఏర్పడ్డ వర్ణ, వర్గాల


సంస్కృతి

225