పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యక్తిగతమైన సంపత్తి (Private Property) కారణంగా లోకంలో పాలితులు, పాలకులుగా మానవజాతి విభజితమై పోయింది. మనిషిని దోచుకొని ఒక జాతి, ఒక వ్యక్తి బాగుపడటం నేటి ఆర్థిక విధానము. దీనికి మూలకారణము వ్యక్తిగత సంపత్తి; భంగ్యంతరముగా సంతానం. ఇవి రెండూ ఏకపత్నీ వివాహ విధానం వల్ల ఏర్పడ్డవి.

దాంపత్య వివాహ విధానంలో తండ్రి ఆహారాన్ని తెచ్చేవాడు. తల్లినీ పిల్లలనూ పోషించేవాడు. వారిరువురి మధ్యా కలహ కారణాలున్నప్పుడు తండ్రి వెళ్ళిపోతూ అతని సామగ్రి పుచ్చుకుని వెళ్ళేవాడు. తల్లి ఆమె సామగ్రి పెట్టుకొని ఇంట్లో ఉండి మరో తాత్కాలిక భర్తను చూచుకునేది. అంటే విచ్ఛేదం, ఇబ్బంది గానీ ఆంక్షగానీ లేదన్నమాట. ఏకపత్నీ వివాహంలో ఒక పక్షం అంగీకరించినా ఇరువురూ అంగీకరించినా సంతాన కారణంగా సంఘమూ, ప్రభుత్వమూ, మతమూ భార్యాభర్తల మధ్య వివాహ విచ్ఛేదము అంగీకృతం కాదు.

ఏకపత్నీత్వ విధానంలో ఆదర్శం ఒకదారి తీసింది. ఆచారం మరొక దారి తీసింది. ఏక పత్నీత్వం ఆచారంలో ఉన్న ఏ దేశంలోనూ మతగ్రంథాలనూ, పురాణాలనూ పరిశీలిస్తే స్త్రీకి విశేష గౌరవం కనిపిస్తుంది. కాని వ్యవహారంలో ఆ రీతిగా ఉండదు. స్త్రీని అతి ఉదాసీన భావంతో చూడటం సమస్త దేశాలలోనూ పొడకట్టుతున్నది. స్త్రీలనూ, సంతానాన్ని పని యంత్రాలుగా పరిగణించి వారిని శుల్కాల క్రింద మార్చుకోవటమూ, వాణిజ్య పదార్థాల క్రింద భావించి, వారి ఇష్టానిష్టాలతో ఈషత్తెనా ప్రమేయం లేకుండా అతిథి పరిచర్యలకూ, మిత్రకోటి ఆనందానుభవాలకూ ఉపయోగించారు. అన్యదేశాలను జయించి తెచ్చిన బానిసకన్యల కిచ్చిన గౌరవం కూడా ధర్మపత్నులకీయని రారాజులు చరిత్రలో లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. ఎప్పుడైనా పురుషులు భార్యను గౌరవించినట్లు కనిపిస్తే అతనికి వారసులైన పుత్రులను ఉత్పత్తి చేసే యంత్రమనే భావంతో తప్ప వ్యక్తిగత ప్రణయం మూలంగా గానీ, తన అర్ధాంగి అనిగానీ కాదు. ఆడ బానిసల మీద అధికారాన్ని ఆమెపరం చేసి భార్యను తృప్తి పరచినారు. అయితే ఆమె కంటి ముందే రాజవంశాలలోని పురుషులు వారిని ఉపపత్నులనుగా స్వీకరించి భోగిస్తుంటే ఆమెకు కిక్కురుమనే అధికారం లేదు. ప్రపంచంలో అన్ని జాతుల్లోనూ ఏకగామిత్వం (Monogamy) ఇదేరీతిగా నడిచింది.

అంటే ఏకగామిత్వ మనేది కేవలము స్త్రీ జాతి విషయంలోనే నన్నమాట. పురుషునికి ఈ వైవాహిక విధానంలో అనంతమైన కామ స్వేచ్ఛ ఉన్నదన్నమాట అందుకనే ఒక తాత్త్వికుడు దీనిని ఏకపత్నీత్వమనటం కంటే ఏక పతిత్వమనటం ____________________________________________________________________________________________________

218

వావిలాల సోమయాజులు సాహిత్యం-4