Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వైవాహిక విధానంలో ఏకపత్నీత్వమనే మార్పు పురుషజాతివల్ల కలగలేదని చెప్పటానికి శాస్త్రజ్ఞులు ఒక కారణం చూపిస్తున్నారు. అది స్వేచ్ఛా ప్రణయము. ఈ ప్రణయము అనాదికాలంలో స్త్రీ పురుషులకు సరిసమానంగా ఉంటూ వచ్చింది. ఈ నాడు స్త్రీలకు లేదు. దీనిని పురుషులు అనుభవిస్తున్నారు. అటువంటి పురుష స్వేచ్ఛా ప్రణయాన్ని ఏ దేశమూ ఏ జాతీ బహిష్కరించలేదు. చివరకు ఎబ్బెట్టుగానైనా చూడటం మానివేసింది. స్త్రీలు అనుభవించటానికి ప్రయత్నిస్తే సంఘం వారిని బహిష్కరిస్తున్నది.

కామం మాట అటుంచినా, ఏకపత్నీత్వ విధానం మూలంగా దాంపత్య వివాహ కాలంలో ఉన్న స్త్రీ జాతి సాంఘిక ప్రతిపత్తి (Social Status) కూడా నశించింది. దాంపత్య కాలంలో స్త్రీల ఆధిక్యాన్ని గురించి ఒక యాత్రికుడు తన యాత్రలలో తిరిగి పొందిన అనుభవాలను వ్రాస్తున్నాడు.

"స్త్రీలు ఇతర కులాల్లోని భర్తలను గురించి సామ్య జీవన విధానమున్న ఇళ్ళలో నివసిస్తారు. అందువల్ల ఆ ఇళ్ళకు వర్గ యద్విధమైన ప్రాధాన్యం లేదు. వాళ్ళకు సంబంధించిన ధాన్యరాశులు అన్నీ ఒకటే. వాటిలో నుంచే అందరూ పంచుకుంటుంటారు. అదృష్టం లేని భర్త ఎవరైనా కాపురం చేస్తుంటే, అతడు సంపాదించ లేకపోతే, అతణ్ణి గొంగళీతో సహా ఏ నాడు బయటికి పొమ్మంటే ఆ నాడు నడవవలసిందే. అటువంటి సందర్భంలో పిల్లలు గానీ, ఇంట్లో ఆస్తిపాస్తులు గానీ వెంటరావు. అతడు వట్టి చేతులతో తిరిగి తండాల్లోనికి వెళ్ళి పోవలసి వస్తుంది. ఈ జాతుల్లో ఆడవారు శక్తిసంపన్నలు, అవసరమైతే వాళ్ళు మగవారి నెత్తిమీద కొమ్ములూడగొట్టి కూర్చోబెట్టగలరు.” ఇటువంటి ఆధిక్యం ఏకపత్నీత్వం ఆచరణలో వచ్చిన తరువాత తారుమారవుతూ, పూర్వకాలంలో పురుషుల న్యూనభావపరంగా మారిపోయింది.

ఏకపత్నీత్వ వివాహ విధానం కుటుంబ సాంఘిక స్థితిలో అనంతమైన మార్పు కల్పించింది. ఇతః పూర్వమున్న వైవాహిక విధానంలో సంతానం తల్లిని తప్ప తండ్రిని గుర్తించలేదు. ఇప్పుడు వారిని పాలించి పోషించడానికి తండ్రికి సమాన ప్రతిపత్తి లభించింది. సామాజిక వివాహ విధానంలోని తండ్రుల కంటే ఈ తండ్రికి బిడ్డలమీద మమకారమూ, తహతహా అధికము కాదు. సంతానం పురుషుడిది. ఆస్తిపాస్తులన్నీ అతనివి. అతని ఆస్తికి ఉత్తరాధికారులు సంతానము. ఈ సంతానం కారణంగా పురుషుడు ఆస్తిపాస్తులను సంపాదించటమూ అభివృద్ధి పొందటమూ జరుగుతుంది.

సంస్కృతి

217