ఈ వివాహ విధానాన్ని గురించి వ్రాస్తూ ఎలెన్కీ మహాశయురాలు ఇలా అన్నది.
“ఏకపత్నీ విధానము అనేక కారణాలవల్ల విజయవంతమైనది. ఇందుమూలంగా ఇతః పూర్వము స్త్రీలకోసం పురుషులలో జరిగే అంతఃకలహాలు నశించినవి. పురుషులు వారి శక్తిని వైజ్ఞానిక ప్రపంచ పర్యవేక్షణ వైపునకు త్రిప్పటానికి అవకాశం లభించింది. స్త్రీ పురుషులదృష్టి సంతాన ప్రాప్తి వైపుకు మొగ్గించి, స్త్రీ పురుషుల కార్యక్రమ విభాగము (Division of work) ఏర్పడ్డది. నిలకడైన జీవితం ఏర్పడ్డది. సంతానం కారణంగా వెనుకటివలె పురుషుని ఇష్టానిష్టాలకు లొంగిపోవలసిన అగత్యం తప్పిపోయింది. పురుషుల సాంసారిక జీవనానికి ఒక ఉదాత్తత లభించింది. ఈ వివాహ విధానం మూలంగా స్త్రీ పురుషులలో సహకార భావం వృద్ధి పొందింది. వారి ఇరువురి మధ్యా అన్యోన్యానురాగాన్నీ, దయాదాక్షిణ్యాలనూ ఏర్పరిచింది. భర్తకు స్వామిత్వం లభించింది. దానితోబాటు పోషణ భారం పైన బడ్డది. స్త్రీ పురుషుని మీద జీవనభృతికి ఆధారపడవలసి వచ్చింది. నిజమే కాని "సత్సంతానవతి” ననే ఆనందాన్ని పొందే సదవకాశం లభించింది.”
మొట్టమొదట చరిత్రలో 'ఏకపత్నీత్వ విధానము' స్త్రీ పురుషుల సమానత్వం కోసం ఉద్భవించలేదు. ఎన్ని మాటలు చెప్పినా అనాది సంఘంలో స్త్రీ కున్న గౌరవం ఏకపత్నీ వైవాహిక ధర్మమైన సంఘంలో ఆమెకు లేదు. ఆమె ఒక విధంగా పురుషునికి బానిస ఐపోయినది అని చెప్పవచ్చును. ఏకపత్నీ వివాహ కాలానికి పూర్వము స్త్రీ పురుష జాతులు రెంటికీ పరస్పరాధిక్యాలకోసం అంతర్యుద్ధాలు జరుగుతూ వచ్చినవి. వాటి ఫలితంగా స్త్రీ జాతి ఓడిపోయింది. పురుష జాతి జయించింది.
అయితే - ఈ వివాహ విధానాన్ని కావలెనని కోరుకున్న వారు స్త్రీలేనని జేచేషన్ వంటి శాస్త్రజ్ఞుల అభిప్రాయము. అనాది మానవ జాతి ఆరణ్యక జీవనం నశించటం ప్రారంభించింది. వైవాహిక విధానాలు క్రమక్రమంగా మార్పు పొందినవి. ప్రాచీన కాలంలో ఉన్న సామ్యగృహ జీవన విధానం నిలవటానికి తగిన అవకాశాలు తక్కువైపోవటం ప్రారంభించినవి. వారికి ఒక నూతనమైన ఆర్థిక విధానం, జీవిత లక్షణ లక్ష్యాలూ ఏర్పడుతూ వచ్చినవి. ఈ నూతన విధానంలో స్త్రీలకు బాధ కలగటం ప్రారంభించింది. అది కారణంగా వారు తాత్కాలికంగా గానీ, మరికొంత కాలంపాటు గాని ఒక పురుషునితోటే వైవాహిక జీవితం గడప నిశ్చయించుకున్నారు. అందుకు స్త్రీ పావిత్య్రాన్నీ పాతివ్రత్యాన్ని అభిలషింప ప్రారంభించింది. పురుషుడికి తనను పాలింపను పట్టాభిషేకం కట్టింది.
216
వావిలాల సోమయాజులు సాహిత్యం-4