పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రక్తసంబంధం ఉన్న బంధువులతో వివాహ బంధాలు దూరమవటం దాంపత్య వివాహంతో ప్రారంభం. అందుమూలంగా కన్యకకు సవ్యమైన వరుణ్ణి, వరుడికి సవ్యమైన కన్యకనూ వెతకటం ఆచారమైంది. ఒక ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు "దాంపత్య వివాహం మూలంగా రక్త బంధువర్గంతో వివాహం జరగటానికి వీలులేకపోయింది. ఇతఃపూర్వం బంధుత్వం లేనివారితో వైవాహిక సంబంధాలు నెరపవలసిన అగత్యం కలగటం చేత, జాతుల్లోని వ్యక్తులు, మానసికంగానూ, శారీరకంగానూ, బలవంతులు కావటం ప్రారంభించారు. శారీరకంగానూ, మానసికంగానూ బలంగల రెండు జాతులుగాని, రెండు కుటుంబాలు గానీ వైవాహిక బంధంతో ఏకమై ఒక జాతిగా గాని, ఒక కుటుంబంగా గానీ పరిణామాన్ని పొందేటప్పుడు వారికి కలిగే సంతానంలో మేధ విస్తారమై, ఉంటుంది. రెండు జాతుల శక్తులూ, రెండు కుటుంబాల శక్తులూ ప్రత్యేకతలూ వారిలో ప్రతిఫలిస్తవి" అని అభిప్రాయమిచ్చినాడు.

అంటే - క్రమక్రమంగా రక్తసంబంధం కలవారిని అధికం చేసుకుంటూ, వారితో వైవాహిక బంధాలను నిషేధిస్తూ ఉండటం వల్ల దాంపత్య వైవాహిక విధానం అమలులోకి వచ్చింది. మొదట జాతిని స్త్రీ పురుషులనే రెండు జాతులుగా విభజించటమూ, తదుపరి ఆత్మబంధు ప్రణయాన్ని అరికట్టటమూ జరిగింది. దాంపత్య వివాహ ధర్మానికి పరిణామ రూపంగా ఏకపత్నీ వివాహము (Monogamy) వైవాహిక విధానంగా అవతరించింది.

దాంపత్య వివాహం అమలులో లేని కాలంలో పురుషులకు స్త్రీలు కోరుకున్నంత మంది దొరికేవారు. ఈ వివాహం వల్ల స్త్రీలు కొందరికి మాత్రమే భార్యలైనారు. పుట్టుకతోటే భార్య అనిపించుకునే స్త్రీ పురుషుడికి గుంపు పెళ్ళి విధానంలో ఉన్న రీతిగా ఉండే అవకాశం పోయింది. అందుమూలంగా దాంపత్య వివాహంతోపాటు రాక్షసవివాహమూ (Marriage by Capture), క్రయ వివాహమూ (Marriage by Purchase) వైవాహిక ధర్మాలుగా ఒకదానికొకటి తోడుగా ఉంటూ ఉండేవి. అయితే ఇవి భార్యలను పొందే మార్గాలలో భేదాలే గాని ప్రత్యేక వివాహ సంస్థలుగా పరిగణింపదగ్గవి కావు.

ఏక పత్నీత్వము (Monagamy) మిథున వివాహానికి (దాంపత్య వివాహానికీ) పరిణామ రూపము. ఇది అనాగరక జాతి ప్రాథమిక ద్వితీయావస్థలలో అవతరించింది. ఈ విధానం ప్రపంచంలో అమలులోకి రావటం మూలాన క్రమక్రమంగా నాగరికత అభివృద్ధి కావటం ప్రారంభించిందన్నమాట. ____________________________________________________________________________________________________

సంస్కృతి

215