Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ నలుగురు భార్యలలో సౌందర్యోపాసనకూ, సంభాషణకూ ఇరానీ స్త్రీ, వంటకు ఖేర్సానీ, శయ్యకు హిందుస్థానీ, తుర్కీ భార్య ధర్మానికి, ఇంకా తన్ననూ కొట్టనూ తిట్టనూ అనేకమంది స్త్రీలను పొందవలసిందని బైరంఖాను అభిప్రాయము.

హిందూదేశపు క్షత్రియులలోనూ, మరి కొన్ని కొండ జాతుల్లోనూ బహుపత్నీత్వం పూర్వంనుంచీ వస్తూ వున్న ఆచారం. పూర్వపు గ్రీసుదేశంలో ఏకపత్నీత్వమే చట్టసమ్మతమైన వివాహ విధానం. కానీ 'ప్రియామన్' రాజుకు అనేకమంది భార్యలున్నట్లు చరిత్రలు చెపుతున్నవి. రోమక న్యాయ శాస్త్రం కూడా ఏక పత్నీత్వాన్నే అంగీకరించింది. రెండవ పెళ్ళి చట్టసమ్మతం కాలేదు. అంతేకాకుండా చట్ట సమ్మతమైన “ఎంపికను” (Lawful Concubinage) అంగీకరించింది.


క్రైస్తవ మతము ఏకపతిపత్నీత్వాన్నే ఆదర్శవివాహ విధానంగా అంగీకరించింది. కాని బహుపత్నీత్వాన్ని అంగీకరింపకపోలేదు. బిషప్పులు, డేకనులు బహుపత్నీత్వాన్ని వహింపకూడదని శాసించింది.


పదునారవ శతాబ్దం మధ్యభాగంలో ఐరిష్ రాజు 'డయార్మైట్కు' ఇద్దరు భార్యలూ, అనేకమంది ఉంపుడు కత్తెలతో పాటు ఉండేవాళ్ళు. లూథరన్ చర్చివారు ఇచ్చిన అధికారంతో చార్లమెన్ చక్రవర్తి ఇద్దరు భార్యలనూ అనేకమంది ఉంపుడు కత్తెలనూ స్వీకరించాడు.

అంతేకాదు, చక్రవర్తుల విషయంలోనే కాదు - కొందరు మతబోధకుల విషయంలో కూడా బహుభార్యాత్వం అమలులో ఉండినట్లు తెలుస్తున్నది. తరువాత కాలంలో హెస్సీ దేశానికి చెందిన ఫిలిప్పు, రష్యాదేశ చక్రవర్తి ఫ్రెడరిక్ విలియము లూథరన్ చర్చివారి అనుమతితో ఇద్దరు భార్యలను స్వీకరించారు. ప్రాత నిబంధన కొన్ని సందర్భాలలో బహుపత్నీత్వాన్ని అంగీకరించినట్లు తెలుస్తున్నది.

క్రీ.శ. 1680 ప్రాంతంలో అనేకమంది యుద్ధభూమిలో చనిపోయినారు. ఆ ముప్పది మూడు సంవత్సరాల యుద్ధానంతరము వెస్టఫేలియా సంధి జరిగింది. నూరెంబర్గు ప్రాంకిష్ ప్రతివ్యక్తీ ఇద్దరిని తప్పకుండా వివాహం చేసుకోవలెనని తీర్మానించుకున్నాడు. అప్పుడు కొన్ని క్రైస్తవ సంఘాలు బహుభార్యాత్వాన్ని ప్రచారం చేసినవి. క్రీ.శ. 1631 ప్రాంతంలో నిజమైన క్రైస్తవుడు కావాలంటే అతడు అనేకమంది భార్యలను వివాహం చేసుకోవలెననే ప్రబోధ నినాదాలు వినిపించినవి.


208

వావిలాల సోమయాజులు సాహిత్యం-4