పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయితే ఈ రెండు వివాహవిధానాలూ జాతులకు సర్వసామాన్యమైన వివాహ విధానాలు మాత్రం కావు. ఇవి బానిస విధానానికి జాతులలో చిహ్నాలుగా నిలచిన రూపాలని చెప్పవచ్చును. ప్రజాసామాన్యంలో ఏకపతి పత్నీత్వము (Monogamy) మాత్రమే వివాహ విధానంగా కనిపిస్తుంటే, కొందరిలో మాత్రం ఇవి ఆచారాలుగా ఉండటమే వీటి బానిస విధాన లక్షణాన్ని నిరూపిస్తున్నవి.


బహుభార్యాత్వం ముఖ్యంగా బానిస విధానం వల్ల ఏర్పడినదేనని చెప్పవచ్చును. కానీ ఇది కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసేవారి విషయంలో మాత్రమే అంగీకారాన్ని పొందింది. పితృస్వామికవిధానం (Partriarchical family System) అమలులో ఉన్న జాతుల్లో కులంపెద్ద, అతని పెద్దకుమాళ్ళు ఒకరిద్దరు తప్ప ఇతరులు అనేకమంది భార్యలను వివాహమాడటం కనిపించదు. జనసామాన్యము ఏకగామిత్వాన్నే అనుసరిస్తుంది. అంటే సామాన్య ప్రజ ఏకపత్నీత్వాన్నే వివాహ ధర్మంగా అంగీకరించి ఆచరిస్తుందన్నమాట! ధనాఢ్యు లైనవారూ, ఉత్తమ కులాల్లో జన్మించామనుకునేవారు బహు భార్యాత్వాన్ని ఆదరిస్తారు. అందులో వారికి భార్యలయ్యే స్త్రీలు బానిసలుగా విక్రీతలైన వారై ఉంటారు. ఒక్కొక్కప్పుడు కొందరు తల్లిదండ్రులు కులగౌరవాన్ని ఆశించో, లేకపోతే తమ మనమళ్ళకు రాజ్యాధికారం రావాలని కోరుకొనో, ఇతఃపూర్వము అనేకమంది భార్యలున్న వానికే కుమార్తెలను ఇచ్చి వివాహం చేస్తుంటారు.


బహు పత్నీత్వ విధానాన్ని పోలినదే బహు భర్తృత్వం (Polyandry) కూడాను. దీని పుట్టుక కూడా బృందవివాహం (Group Marriage) నుంచే వచ్చి ఉంటుందని శాస్త్రజ్ఞులు ఊహ చేస్తున్నారు. 'ఏంజల్సు' మహాశయుడు ఈ విధానాన్ని గురించి ఇలా అన్నాడు :


"ఈ విధానాన్ని గురించి ఊహిస్తే చాలా భయంకరంగా కనిపించవచ్చును. కాని ఇది కొన్ని కొన్ని దేశాలలో - ముఖ్యంగా ముసల్మాను రాజ్యాలలో, కనుపించే జనానా జీవితాలకంటే భయంకరంగా ఉండదు" అని.

బహుభర్తృత్వం అనేది ప్రపంచంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నది. ఈ వివాహ విధానంలో ఒక స్త్రీ అనేకమంది భర్తలతో కాపురం చేస్తుందని వెనుక తెలుసుకున్నాము. ఈ బహుభర్తృత్వానికీ, బృంద వివాహానికి విశేషమైన తారతమ్యం ఉన్నది. బృందవివాహంలో ఒక జాతిలోని స్త్రీలందరూ ఆ జాతిలోని పురుషులకు, వివాహమాడినా ఆడకపోయినా భార్యలు. ఇందులో మరీ కొన్ని అనాగరక జాతుల్లో అమ్మ, అక్క, చెల్లెలూ - తండ్రి, అన్న, తమ్ముడూ అనే వివక్ష కూడా ఉన్నట్లు కనపడదు.


202

వావిలాల సోమయాజులు సాహిత్యం-4