Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బహు భర్తృత్వం - బహు భార్యాత్వం

అనాది కాలంలో వివాహమనే వ్యవస్థ ఏ విధమైన శాస్త్రాన్నీ అనుసరించి ఏర్పడ్డది. కాదు. స్త్రీ పురుష జాతులు రెంటికీ మధ్య ఏర్పడ్డ శారీరక సంబంధం దీనికి మూలమైన ఆధారం. అది క్రమక్రమంగా పరిణామ రూపాన్ని పొందుతూ నేటి వైవాహికసంస్థగా పరిణమించింది. ఆదిలో అది కేవలము శారీరక సంబంధము మాత్రమే. ఈ సంబంధం వల్ల స్త్రీ పురుషులు ఇరువురకూ సంతానం కలగటమూ, కుటుంబాలు ఏర్పడటమూ జరిగింది. అదే తరువాత సభ్య ప్రపంచంలో అనేక నిబంధనలతో ఆచారంగా పరిణమించింది.


అందువల్ల ఎలెన్ కీ మహాశయురాలు అన్నట్లు 'వివాహము చరిత్రాత్మకమైన సత్యము. ఏ నాడది చరిత్రాత్మక సత్యముగా నిలిచిందో ఆ నాడు ఆ వివాహ వ్యవస్థ శాస్త్రీయ మనిపించుకున్నది. సంఘం నిలవటానికి, వివాహ నియమాన్ని అత్యవసరంగా పరిగణించ వలసి వచ్చినది. మతము దానికి ప్రోత్సాహమిచ్చి సుస్థిరం చేసింది.”


ప్రపంచంలో ఉన్న వివాహ విధానాలను గమనిస్తే ఈ అంశాలు వ్యక్తమౌతవి. ఒకానొక కాలంలో వివక్షారహితమైన కామోపభోగం (Promiscuity) లోకంలో ఉండి ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు అభిప్రాయమిస్తున్నారు. అటువంటిస్థితిలోనుంచి మానవజాతి బృందవివాహము (Group-Marriage) అమలులోకి తెచ్చుకున్నది. దాని పరిణామ రూపంగా దాంపత్య వివాహము (Pairing Marriage) ఏర్పడ్డది. నిలకడ లేని ఈ దాంపత్యంలోనుంచీ అంతకంటే సుస్థిరమైన ఏకగామిత్వ (Monogamy) వివాహవిధానం ఆధునిక ప్రపంచంలో సర్వజనాంగీకృత వివాహ విధానంగా నిలచి ఉన్నది. ప్రణయ వివాహము (Love Marriage) ఇంతకంటే అత్యుత్తమమైనదని నేటి సభ్య ప్రపంచంలో విశేష ప్రచారం జరుగుతూ ఉన్నది. దాని మంచిచెడ్డలూ ఇంకా పరీక్షితాలు కావలసి ఉన్నది.


లోకంలో అనేక దేశాల్లోనూ అనేక జాతుల్లోనూ బహు భర్తృత్వమూ (Polyandry), బహు భార్యాత్వమూ (Polygamy) సకృత్తుగా కనిపిస్తున్నవి. ఈ వివాహ విధానములు మానవజాతిలో దాంపత్య వివాహం, బృంద వివాహమూ, అమలులో వున్న సంధికాలంలోనే ఏర్పడి ఉంటాయని కొందరు శాస్త్రజ్ఞులు చెపుతున్నారు.


సంస్కృతి

201