పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అసత్సంతానం (అధర్మ సంతానం కలిగితే అందరూ అసహ్యించు కుంటారు, ప్రపంచంలో వారి వారి వివాహ నియమాలు ఎంత నీరసాలైనా సరే. అందుకనే ఏ లోపమూ లేని కన్యకను దానం చెయ్యడం. ఇటువంటి హిందువులు ఒకానొక కాలంలో 'దేవర న్యాయాన్ని' అంగీకరించారంటే గమనింపదగ్గ విషయం. ఇది కేవలమూ వంశరక్షణ సూత్రం మీద ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఒక మగవాడు నష్టపడితే వంశానికీ, దేశానికీ, జాతికీ భంగపాటుగా వారు భావించి ఉంటారు. ఒకానొక కాలంలో పాశ్చాత్య దేశాలలో వచ్చిన చట్టం (Leverite Law) ఇటువంటిదే. ఈ చట్టము ఆ సంతానాన్ని అంగీకరించదు గానీ మఠాధిపతి అనుజ్ఞతో అన్యుని వల్ల సత్సంతానాన్ని పొందటానికి అంగీకరిస్తుంది. ఇది కేవలమూ సంతాన ధర్మాలను మనస్సులో ఉంచుకుని చేసినదని వేరే చెప్పవలసిన పనిలేదు.


హిందూ వివాహం కామతృప్తి కోసం కాక సత్సంతానాని కోసం అది శారీరకావసరమని (Biological Necessity ) శాస్త్రజ్ఞులు గుర్తించకపోలేదు. మనువు దీనిని బట్టే ప్రమాణంలో వ్యభిచారాన్ని ఖండించాడు. ఏ విధంగా జింక మొదట కొట్టినవాడిదే ఔతుందో అదేవిధంగా సంతానం భర్తది అన్నాడు. సుశ్రుతాచార్యులు తరువాత కలగబోయే సంతానానికి కావలసిన సమస్తమూ శుక్లంతో ఉన్నదని నాల్గవ అధ్యాయంలో వాక్రుచ్చాడు. అది లింగ శరీర రూపంతో ఉంటుందని అన్నాడు. అయితే వైయక్తిక భేదాల మాటేమిటని చరకాచార్యుడు ప్రశ్నించుకొని, మూడవ అధ్యాయంలో అంధత్వము వికలత్వము మొదలైనవి బీజానికున్నా, గర్భాదాన ఉల్బణకర్మ కలిగేటంతవరకూ ఆ గుణా లంటవని సమాధానం చెప్పినారు. అది కేవలము శరీరమొక్కటే కాదు. ఆత్మ మరొకటున్నదని వారి అభిప్రాయం.

సారాంశము. హిందూ వివాహానికే సత్సంతానము లక్ష్యము. దానికి యువతీ యువకులు తమ బ్రహ్మచర్యాన్ని కొంత కాలం అవలంబించవలసి ఉంటుంది. బ్రహ్మచర్యంలోనే గార్హస్థ్య స్థితికి అత్యావశ్యకాలైన లక్షణాలన్నీ ఉన్మీలితాలై ఉన్నవని హిందూవేత్తల అభిప్రాయం.

(ఆంధ్రపత్రిక -1948 మార్చి, 24వ తేది)


200

వావిలాల సోమయాజులు సాహిత్యం-4