Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కానీ మనువు చెప్పిన సూత్రాలనన్నిటినీ తూచా తప్పకుండా అనుసరిస్తే లోకంలో వివాహం కాని వాళ్ళు అనేకమంది మిగిలిపోతారు. చాలామంది బ్రహ్మచారులూ, సన్యాసులూ, జోగులూ - ఉభయ జాతుల్లోనూ ఉంటారు.

ప్రపంచంలో ఉత్తమ కోటికి చెందిన మహా మేధావులును అనేకులను సృజించినది హిందూజాతి. ఏ వ్యక్తి ఐనా స్వయంవ్యక్తిగా నిలవటానికి కారణాలు అతను కొన్ని గుణాలతో పుట్టటమే. అవి వాతావరణం వల్ల అభివృద్ధి పొందుతవని భారతీయ విశ్వాసము. మానవుడు పురుషోత్తమత్వస్థితిని పొందటానికి మూలాలు రెండు.

1. దైవ సంపద, 2. పురుష కారము అని పెద్దలంటారు. ఇందులో మొదటిది అతని పుట్టుకనూ, గుణగణాలనూ, జీవిత ప్రమాణాన్నీ తదితరాలనూ నిర్ణయిస్తుంది. పురుష కారము కేవలము వాతావరణానికి సంబంధించినది. ఈ రెండూ మానవాభివృద్ధికీ, సత్సంతాన ప్రాప్తికీ ఆవశ్యకాలని హిందూతత్వ వేత్తల అభిప్రాయము.

బీజ క్షేత్రాలలో బీజమే విశేషశక్తి కలిగినది అని మనువు. లోకంలో ఏ ప్రాణిలోనూ బీజానికి భిన్నమైన ప్రాణి జనించదు. మానవులలోనూ అంతే పురుషుడు బీజము. స్త్రీ క్షేత్రము. స్త్రీలో ఉండే ప్రాణాండము బీజమును వహిస్తుందనీ ఆయన అభిప్రాయము. అందువల్లనే ఆయన ఏకవర్ణ వివాహాలు (Intra - O caste Marriages) అంగీకరించి, వర్ణాంతర వివాహాలు (Iner O caste marriages) తిరస్కరించినాడు. ఏకవర్ణ వివాహాలు శారీకంగానూ, మానసికంగానూ, దైనందిక వ్యవహారోచితంగానూ 'సరిసాటి' మీద ఆధారపడినవి. మనువును అనుసరించి సరిసాటి వారికి సంపర్కం ఉండకూడదు. ఆయనే ఒకచోట ఏ విధంగానైనా ఏడు తరాల వరకూ ఉత్తమ సంపర్కం కలిగితే, అధమవర్గానికి కూడా కలిగే సంతానం ఉత్తమస్థితికి చేరుకుంటుందని అన్నాడు. ఇందులో గర్భితమైన ముఖ్యసూత్రాన్ని సంతాన శాస్త్రజ్ఞులు అంగీకరించారు.

కన్యావివాహాన్ని గురించి మరోమాట. హిందువులకు స్త్రీ సంతానం కంటే పురుష సంతానం మీద విశేషాసక్తి. వారు ఉత్తమ లోకాలకూ పనికి వస్తారని వారి నమ్మకం. స్త్రీ సంతానం కేవలమూ పరలోకానికే పనికివస్తారు. అందువల్లనే హిందువులు కన్యను, దానయోగ్యమైనను ప్రధాన వస్తువుగా భావించి ఈ దానం మూలంగా ప్రజాపతి చేయబూనిన సంతాన సృష్టికి తాము తోడ్పడుతున్నామని భావిస్తారు. అటువంటి సందర్భంలో దానం కళంకరహిత మైనదై ఉండాలి. లేకపోతే పాపం చుట్టుకుంటుంది. అందువలన ఆమెను కన్యకగా ఉన్నప్పుడే కాళ్ళు కడిగి దానం చేస్తారు.


సంస్కృతి

199