Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహ విషయంలో ఆర్యుల గృహ్య సూత్రాలు ఏమని చెప్పుతున్నవో ఈ సందర్భంలో పరిశీలించటం సమంజసము. వివాహం చేసుకునే వారు తల్లివైపూ, తండ్రివైపూ వంశ చరిత్ర జాగ్రత్తగా పరిశీలించటం అవసరమంటున్నారు. కన్యకను తల్లిదండ్రులు, యువకుడూ, మేధాసంపన్నుడూ అయినవాడికి ఇచ్చి వివాహం చెయ్యటము ధర్మమనీ, యువకుడు శుభలక్షణాంగిని సద్వంశజను, నచ్చిన కన్యకను, ఆరోగ్యవంతురాలిని వివాహంచేసుకోవలసి ఉంటుందనీ ఆశ్వలాయనగృహ్య సూత్రాలు చెపుతున్నవి. ఈ అభిప్రాయాలనే ఆపస్తంబాది ఇతర సూత్రకారులూ, పురాణ కర్తలూ బలపరుస్తున్నారు.


వరాహ పురాణంలో కన్యా లక్షణాన్ని గురించి ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉన్నది. అందులో కన్యక రూపమూ, అవయవ లక్షణాలూ విపులంగా చర్చితాలైనవి. ఇవన్నీ సంతాన శాస్త్రజ్ఞులు అంగీకరించే విషయాలు. వాత్స్యాయనుడు కన్యావరణాధ్యాయంలో ఈ విషయాన్ని కామశాస్త్రానుగుణంగా పరిశీలించాడు. మానవ, గంధర్వ, యక్ష, దేవ, సత్త్వాదుల క్రింద స్త్రీ పురుష జాతులను రెంటినీ విభజించి, ఆయా జాతివారికి వివాహం జరిగించటం యుక్తమని మన శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆ కాలంలో మాటికులనే పేరుతో వంశ సంబంధాలూ, బంధుత్వాధికాలూ, సత్త్వాధికాలూ గ్రహింపగలిగిన వారు వివాహ బంధాలను కుదురుస్తూ ఉండేవారు. అంతేకాకుండా జ్యోతిష శాస్త్రాన్ని వారు ఆధారంగా స్వీకరించేవారు.


మనువు ఒకచోట “ఒక యువకుడు, గుణసంపన్నుడూ, సుశరీరుడూ, రూపసీ దొరికితే పుష్పవతికాని కన్యకనైనా యిచ్చి వివాహం చెయ్యవచ్చు" నని అభిప్రాయ మిచ్చినాడు. కొన్ని కొన్ని కుటుంబాలలో వివాహాలు పనికిరావనీ, ధన ధాన్యాది సంపత్తిని జూచి మోసపోవద్దనీ, సద్గుణ సంపత్తి లోపించిన వారితో వివాహ బంధం పనికిరాదనీ ఆయన అభిప్రాయపడినాడు. బొల్లి, నంజు, కుష్ఠు, మొదలయిన వ్యాధులు వంశంలో ఉంటే వారికి పిల్ల నివ్వకూడదన్నాడు. జుట్టు విశేషంగా ఉన్నవారితో సంబంధం పనికిరాదన్నాడు. మనుధర్మశాస్త్ర వ్యాఖ్యాత అయిన కుల్లికుడు ఆ జబ్బులు సంతానానికి కూడా కలుగవచ్చునని అభిప్రాయమును వ్యక్త పరిచాడు. అయితే ఒకొక్కప్పుడు ఆ పారంపర్య దోషం సంతానానికి కలుగకపోవచ్చును. కాని మనువు ప్రధానోద్దేశం సత్సంతానము. అందువల్లనే వివాహం మంచి కుటుంబాల మధ్యనే జరగవలెనని అభిప్రాయం.


198

వావిలాల సోమయాజులు సాహిత్యం-4