Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహ విధానంలో గోచరిస్తున్నవి. హిందువుల గృహ్య సూత్రాలూ, స్మృతులూ ఇందుకు ప్రబల సాక్ష్యాలు. హిందువుల ధర్మంలో సాంఘిక జీవితం సమ్మేళనాన్ని పొందింది. ధర్మాన్నీ, స్మృత్యాదులనూ పాటింపకుండా చరించినవారికి శిక్ష 'పాపకూపం' అనే బెదిరింపు, లేదా సంఘ బహిష్కృతి. ఇందులో మొదటిది ప్రాచీన కాలంలో బాగా పనిచేసింది. నేటి ప్రజాపరిషత్తులో జరిగే చట్టాలమీదకంటే వాటిమీదనే లోకానికి భయం విశేషంగా ఉన్నట్లు అవగతమౌతున్నది. నాలుగు వేల సంవత్సరాల నుంచీ నానావిధాలైన రాజకీయాలకూ, దండయాత్రలకూ, సాంఘిక జీవన విధానంలో పరప్రభావాలకూ గురియౌతూ వచ్చినా విశేషమైన మార్పులు హిందూ జాతి ధర్మాలలో కలగకపోవటం విశేషమైన ఆశ్చర్యం కలిగిస్తున్నది. అంతేకాకుండా హిందూజాతి స్మృతి, గృహ్యసూత్రాదుల ఆధిక్యమును వేనోళ్ళ చాటుతూ ఉన్నది.


ఈ గృహ్య సూత్రాలు గానీ, స్మృతులు గానీ మొదట కొద్దిపాటి సమాజాన్ని ఉద్దేశించి పుట్టినవి. తరువాత అనేక కారణాలమూలంగా అనేక జాతులు వచ్చి హిందూజాతిగా ఏర్పడ్డవి. ఆర్యావర్తపు టెల్లలు హిమాలయాలు మొదలు కన్యాకుమారి వరకూ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినవి. అయినా సాంఘిక స్థితిలో - లోపాలు లేవని కాదు - విశేషమైన మార్పులు కలగకపోవటానికి స్మృతికర్తల మేధావిశేషమే కారణమని ఒప్పుకొని తీరాలి.


యజుర్వేదంలో "పశ్యతి పుత్రం, పశ్యతి పౌత్రం, ప్రప్రజయా పశుభిః మిథునైర్జాయతే యస్యైవం విదుషాగ్ని హోత్రం జుహ్వతి” అని పరాయిత బ్రాహ్మణం పలుకుతున్నది. వివాహం ఎందుకోసం? సత్సంతానం కోసం. అందుకనే మహాకవి కాళిదాసు రఘువంశాన్ని వర్ణిస్తూ 'ప్రజాయై గృహమేధినాం' అని అన్నాడు.


'అపుత్రస్య గతిర్నాస్తి' అనే ఆర్యోక్తి లోక ప్రసిద్ధమైనదే. అంటే భారతీయ వివాహం పాశవ ప్రేమకోసం కాదు, ఉత్తమ గతికోసం. అభ్యుదయం కోసం. సంతాన శాస్త్రం కూడా వివాహం అత్యవసరంగా చేసుకొని తీరవలెనని చెపుతున్నది. ఆర్యధర్మము కూడా భంగ్యంతరంగా వివాహం చేసుకోవలసినదేనని విధిస్తూ ఉన్నది. స్త్రీ పురుష సంయోగానికి ఫలితాంశం సంతానం. సంతానంలేని దాంపత్యం పరిహాస పాత్రమౌతూ ఉండటమూ, బేలతనాన్ని వహించటమూ ఇందుమూలాననే.


కుమారుడు కలగటమంటే ఆర్యులకు ప్రజాపతిత్వం వహించటమన్నమాట! ప్రజాపతి కరుణాప్రసాదాన్ని పొందటమన్నమాట!! అందువల్ల నిత్యబ్రహ్మచర్యాన్ని వారు గర్హించారు. నాడు 'ఘోటక బ్రహ్మచారి' అనే పలుకుబడిలో న్యూనత గోచరిస్తుంది.


192

వావిలాల సోమయాజులు సాహిత్యం-4