విజ్ఞానాదికాలు అన్నీ పెంపకానికి సంబంధించినవి. తల్లిదండ్రుల శుక్లశోణితాల సంయోగం వల్ల మాతృగర్భంలో ఒక చిన్న అండం ఏర్పడుతుంది. మనస్సు ఊహించలేనన్ని శక్తులు దానికి అప్పుడే సంక్రమించి ఉంటవనీ, ఆ సమయంలో ప్రకృతి భవిష్యత్తులో ఆ అండం వల్ల జన్మించబోయే బిడ్డ భవితవ్యాన్ని సమస్తమూ నిరూపించే సంతానశాస్త్రం పలుకుతూ ఉన్నది. అందువల్ల వంశపారంపర్యంగా వచ్చే ప్రకృతి శక్తికి ప్రాథమిక ప్రాధాన్యత ఉన్నదని మనకు అవగతమౌతున్నది. శుక్ల శోణిత సంయోగం ఏర్పడే అండానికి ప్రకృతితః కలిగే గుణాల ననుసరించే బిడ్డ పాలు తాగటమూ పెరిగి పెద్దది కావటమూ జరుగుతుంది. అది కారణంగా కొందరు శాస్త్రవేత్తలు పుట్టుకను గర్భధారణకు ముందే పరిగణిస్తారు.
వ్యక్తులకు వైజ్ఞానికంగానూ, మానసికంగానూ, శారీరకంగానూ పుష్టిని
కలిగించడంలో వంశపారంపర్యమైన ముఖ్యమైన ప్రకృతిశక్తి గొప్పదా, లేక వాతావరణ
శక్తి గొప్పదా, అనే అనుమానం అప్పుడప్పుడూ అందరికీ కలుగుతుంది. అటువంటి
ప్రశ్న కలగటం, సమంజసం కూడాను. అయితే దానికి తగిన సమాధానం ఇంతవరకూ
రాలేదు. లోకంలో ఏ సాంఘిక చట్టము వచ్చినా వాతావరణానికే విశేష ప్రాధాన్యం
ఉన్నదనే నమ్మకంతో వస్తున్నది. రాజకీయవేత్తలూ సంఘసంస్కర్తలూ దానికే విశేష
ప్రాముఖ్యం ఉన్నట్లు పరిగణిస్తున్నారు.
"ప్రకృతి పోషణలో ఒకదానిని మించాలని ఒకటి ప్రయత్నిస్తే - రెంటికీ సమాన
బలం ఉన్నప్పుడు కూడా ప్రకృతి జయించి తీరుతుంది. పోషణ ఓడిపోతుంది. అయితే
ఏ ఒక్కటీ యథాతథంగా మానవజాతినిగానీ తదితర ప్రాణికోటిని గానీ అభ్యుదయ
పథంలో నడిపించటానికి తమంతట తాము స్వయంశక్తాలైనవి కావు. ప్రకృతి శక్తి
చాలా గొప్పదైనా క్రమమైన వాతావరణం లేకపోవడం వల్ల అది లోపించవచ్చును.
అంతేకాదు. ప్రకృతి, సహజంగా ఉన్న పాశవృత్తినీ, శారీరకమైన అర్భకత్వాన్నీ
బలహీనమైన మానసిక వృత్తినీ, వాతావరణం పోషణతో ఎంత ప్రయత్నించినా పూర్ణంగా
మార్చలేవు" అనిఒక శాస్త్రవేత్త అభిప్రాయ మిచ్చినాడు. ప్రకృతి శక్తి (వంశ
పారంపర్యశక్తి) పోషణశక్తి కంటే అయిదు మొదలు పదిరెట్ల వరకూ శక్తిమంతమైనదని
సంతాన శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
'లోకంలో శక్తిమంతమైనది మాత్రమే నిలుస్తుంది; అదే నిలవవలె' నని డార్విన్ మహాశయుడు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంటే ఆ సిద్ధాంతం లోకంలో జరిగే సమస్త హింసాకాండనూ ప్రతిఘటించకుండా చూస్తూ ఊరుకోమని కోరుతుంది.
190
వావిలాల సోమయాజులు సాహిత్యం-4