పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేటి ప్రపంచ సభ్యతా సంస్కృతులను గమనిస్తే ముందు వివాహ సంస్థ నిలవటానికి అవకాశం లేదని అవగతమౌతున్నది. వెనుకటి స్వామిత్వం నశిస్తున్నది. సామ్యత్వం వస్తున్నది. సంసార మన్న తరువాత స్వామిత్వం కష్టసాధ్యము. వివాహ సంస్థను రక్షించదలచుకుంటే ఈ నాడు మన సంస్కృతిలో ప్రవేశిస్తున్న మార్పులను గమనించి తదనుగుణంగా వివాహ ధర్మాన్ని మార్చుకోవలసి వస్తుంది. అలా చేయకపోయినా, చేయలేకపోయినా సంఘంలో స్తిమితత ఉండదు. సంఘం పతన్మోఖమై క్రమక్రమంగా బ్రద్దలైపోతుంది.


కేవలం ఆర్థిక సమస్య ఒక్కటే కాకుండా మరికొన్ని క్లిష్ట సమస్యలు కూడా వివాహ సంస్థను నేడు ఎదుర్కొంటూ ఉన్నవి. పాశ్చాత్య దేశాలలో ముప్పది ఏండ్లలోపల ఎవరూ వివాహాన్ని చేసుకునే స్థితిలో లేరు. దీనికి ముఖ్యమైన కారణాలలో సంతాన నిరోధక ద్రవ్యాలను విరివిగా ఉపయోగించటం ప్రథమమని చెప్పవచ్చును. ప్రపంచానికి ఈ నిరోధక (Contraceptives) ద్రవ్యాలు కొత్తవి కావు. అనాదినుంచీ ఉంటూ ఉన్నవి. కానీ అవి ఈ నాడు ఉపయోగంలో ఉన్నట్లు పూర్వకాలంలో లేవు. జనసామాన్యానికి ఆ నాడు అందుబాటులో కూడా లేవు.


వివాహమంటే సంతాన రక్షణ కోసమూ శ్రేయస్సుకోసమూ భార్యభర్తలిద్దరూ ఏర్పరుచుకునే బంధమని వెనుక చెప్పి ఉన్నాము.


అటువంటి సందర్భంలో పిల్లలు లేనప్పుడూ అనవసరమైనప్పుడూ వివాహంతో సంబంధం లేదు కదా? - అనే ప్రశ్న ఉదయిస్తుంది; దానిని అనుసరించి ఆ స్థితిలో వివాహంతో పనిలేదు. దానిని పాటింపనవసరంలేదు; మానవులకు కామము శారీరకనైజగుణము (Biological Necessity) అని వాదించవచ్చును. ఈ వాదం స్థూలదృష్టికి సమంజమైనది అని కూడా అనిపించవచ్చును. తర్కశాస్త్రానుసారంగా పరిశీలిస్తే ఇంతకంటే నీచాతినీచమైన వాదం మరొకటుండదని వ్యక్తమౌతుంది. వివాహ ధర్మానికి వ్యతిరిక్తమైన స్త్రీ పురుష సంబంధాన్ని అంగీకరించిన కొద్దీ వివాహ సంస్థకు దెబ్బ తగులుతుంది. తన్మూలంగా సంఘ శక్తి, స్తిమితత, పవిత్రత రూపు మాసిపోతవి. వైవాహిక నీతినియమాలు ఎటువంటివైనా వాటికి భిన్నంగా కనిపించే కామోపభోగాన్ని ప్రతిజాతీ, ప్రతిసంఘమూ ఆ నాటికాలంనుంచీ నిరసిస్తూ వస్తున్నది.


నేటి నాగరికత సభ్యతలో స్త్రీ పురుష సంబంధాన్ని మరింత క్లిష్టం చేస్తూ ఉన్నది స్త్రీల సమాన ప్రతిపత్తి, వారి సంపూర్ణ స్వేచ్ఛ. వెనుకటి కాలంలో స్త్రీ వివాహం


184

వావిలాల సోమయాజులు సాహిత్యం-4