Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కానీ కాలం మారిపోయింది. వివాహం కేవలము సంతానం కోసమని అంగీకరిస్తే నేటి ప్రపంచ రాజకీయ పరిణామ స్థితిలో వివాహమే అనవసర మనిపిస్తుంది. స్వేచ్ఛా ప్రణయాన్ని అనుసరించి కలిగిన సంతానాన్ని ప్రభుత్వానికి (State) ఒప్పచెప్పితే సరిపోదా అనే ప్రశ్న ఉదయిస్తుంది.


ఈ సిద్ధాంతాన్ని గురించి సమర్థించినవారు కూడా లేకపోలేదు. ప్రభుత్వం ఆధునిక కాలంలో, అనాదికాలంలో తండ్రి వహించిన అనేక బాధ్యతలను వహిస్తూ ఉన్నది. అదే రీతిగా తల్లి భారాన్ని కూడా నేటి ప్రభుత్వం వహించవలసి ఉంటుందని వీరి అభిప్రాయము. అంటే సంతానరక్షణ విషయం వ్యక్తిపరము కాకుండా ప్రభుత్వపరము కావలెనని వీరి భావము.


ఈ విధంగా వాదించే వారు ఒక ప్రధాన విషయాన్ని మరచిపోయారని అనవలసి వస్తుంది. తల్లిదండ్రులు బిడ్డలకు ఆహారమూ, కట్టుగుడ్డ, వుండటానికి మంచి ఇల్లూ ఉండటంతో తృప్తి పడలేరు. ఇవన్నీ ఇవ్వకలిగినవాళ్ళుంటారు. లేనివాళ్ళూ ఉంటారు. కానీ అనురాగంతో చూచుకోని తల్లిదండ్రులు అరుదు. ప్రభుత్వం కంటే ఒకొక్కప్పుడు విద్యావిహీనులైన తల్లిదండ్రులుండ వచ్చును. అటువంటి సందర్భంలో సంతానాన్ని ప్రభుత్వపరం చెయ్యవలసిందని వారిని శాసనమూలంగా బలాత్కరించటము ఎంత ఘోరంగా ఉంటుందో, వారికి అటువంటి ప్రభుత్వ విధానం మానసికంగా ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించవలసి ఉంటుంది.


'వివాహ సంస్థ' అనాది కాలం నుంచీ లేదని గానీ, నాగరికత అభివృద్ధి పొందుతూ ఉన్న కొద్దీ మానవుడు కృత్రిమ రూపంతో దీన్ని కల్పించుకున్నాడని గానీ భావించటానికి అవకాశం లేదు. అంటే ఏ నాడో మానవసంఘం ఏర్పాటు చేసుకున్న వివాహ సంస్థకు మార్పు రాదని అనుకోటానికీ వీలులేదు.


ఏ ధర్మంగానీ, ఏ సంస్థగానీ నిలువవలెనంటే కాలంతో పాటు మార్పు పొంది తీరవలసిందే. మానవుడు వివాహం కోసం పుట్టలేదు. వివాహమే మానవుడి కోసం పుట్టింది - అన్న విషయం కూడా మరచిపోకూడదు.


వెనుకటి జీవన విధానం మారిపోతున్నది. అన్ని దేశాలూ క్రమక్రమంగా పారిశ్రామిక దేశాలుగా మార్పు పొందుతున్నవి. అందుమూలంగా జీవనము భారమైపోతున్నది. యువతులూ, యువకులూ ఈ వివాహ భారాన్ని నెత్తిమీద కెత్తుకోవటానికి జంకుతూ ఉన్నారు. యుక్త వయస్కులై స్వశక్తి మీద సంసారం చేయగలిగిన శక్తి కలిగేటంత వరకూ వారు వివాహం మాట తలపెట్టటం లేదు.


సంస్కృతి

183