పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Incest) కనుపించదు. తండ్రికీ కుమార్తెలకూ, తల్లికీ కుమాళ్ళకూ, ఏకగర్భజనితులైన అన్నచెల్లెళ్ళకూ, అక్క తమ్ములకు కామ సంబంధం ఏ జాతీ అంగీకరించదు. ప్రాచీన కాలంలో ఈజిప్టు, పెరూ దేశాల రాజవంశాలలో ఇటువంటి ఆత్మబంధు సంబంధమున్నట్లు చరిత్రవల్ల గోచరిస్తున్నది. దేవాంశ సంభూతులు కావటం చేత సామాన్య ప్రజలకు వారితో వైవాహిక సంబంధం, ముఖ్యంగా కామసంబంధం ఉండటానికి అంగీకరించకపోవటం వల్ల ఇది ఏర్పడినది. అయితే ఆ దేశాలలోనూ ఆ ప్రాంతాలలో సామాన్య ప్రజలలో ఇటువంటి సంబంధం కనిపించదు.


ఆత్మబంధు ప్రణయ రహితత - అనేది ఒక నియమము (వైవాహిక నియమము) అని తెలుస్తున్నది. దీనికి కారణమేమిటి? జాతికే ఆధారభూతమైన ఈ సంసారం (Family) విచ్ఛిత్తి కాకుండా ఉండటమేనని మనము ఊహించ వచ్చును.


స్వీయబంధు ప్రణయం మూలంగా సంసారాలు నానారకాలైన మానసిక ఆవేదనలు కలిగి కుటుంబానికి ప్రమాదం తీసుకువచ్చే స్థితి ఏర్పడడం జరుగుతుంది. అందువల్ల కుటుంబేతరమైన వివాహవ్యవస్థ అమలులోకి వచ్చి ఉంటుందని శాస్త్రకారులు ఊహిస్తూ ఉన్నారు.


జంతువుకు సంతానం కలిగితే వాటిని పోషించే భారం విశేషంగా తల్లిదండ్రుల మీద ఉండదు. గుంపులో చేరి వాటి ఆహారాన్ని అనే తెచ్చుకుంటూ ఉంటవి. సంతాన విషయంలో మానవజాతి అలా బాధ్యతారహితంగా ఉండే అవకాశం లేదు. మానవ సంతానానికి స్వతంత్ర జీవనం చేసే శక్తి వచ్చి సాంఘికంగా స్వతంత్రతను పొందే స్థితి ఏర్పడటానికి ఎంతోకాలం పడుతుంది. అటువంటి స్థితి రావటానికి తల్లి దండ్రులు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. వైవాహిక బంధం (Social Contract) అందువల్లనే వారిరువురికీ అత్యవసరమైంది. 'సంతాన రక్షణమే' ఈ వైవాహిక బంధానికి ప్రధాన కారణమంటే తప్పులేదు.


ఈ వైవాహికబంధం కేవలము కామోద్వేగము (Sexual Passion) మీద ఏర్పడ్డ వారియెడకంటే 'సంతాన ప్రాప్తి- రక్షణ'ల మీద ఆసక్తి ఉన్నవారియెడ ఏర్పడేది సుస్థిరంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతూ ఉన్నారు. అందుమూలంగానే సంతానం కోసమని ఏర్పరుచుకున్న వైవాహిక స్త్రీ పురుష సంబంధాన్ని సంఘమూ, మతమూ ఆమోదించటమూ జరుగుతున్నది. అందువల్ల 'వివాహం' అనే విధానము స్త్రీ పురుషులు కామతృప్తి కోసం ఏర్పడ్డ సంస్థ కాదు; సత్సంతానప్రాప్తి, పోషణ, రక్షణాదుల కేర్పడ్డ సంస్థ' అనటం సమంజసం.


182

వావిలాల సోమయాజులు సాహిత్యం-4