పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇందు వేశ్యకు గమ్యులు కేవలార్థులు ప్రీతి యశోర్థులని ద్వివిధములుగ రూపించి వాని అంతర్విభేదములను నిరూపించి, సహాయుల చెప్పి, ఆమె కగమ్యులను వివరించి, గోష్ఠీ ఉపావర్తనాదిక్రియా స్వరూపమును వెల్లడించినాడు. వారికి కాంతానువృత్త విధానమును, కాంతాను వృత్తమున, ప్రియాస్వీకరణము, అర్థాగమోపాయాద్య ధ్యాయమున అర్థస్వీకరణ విధానమును చెప్పినాడు. తదువరి విశీర్ణ ప్రతిసంధానాధ్యాయమున విశీర్ణ నాయకుని పొందు విధానమును చెప్పినాడు. లాభవిశేషాద్యధ్యాయమున గణిక, రూపాజీవ, కుంభదాసీలు వారి లాభములనెట్లు ఉపయోగింప వలయునో శాసించినాడు. తదుపరి అర్థానర్థానుబంధ సంశయ విచారా ధ్యాయము వైశికము చివరి అధ్యాయము. ఇందు విటులనేకులు విశ్వాసము గలిగి గోష్ఠీ పరిగ్రహముగ పొందిన వేశ్య ద్రవ్యార్జన మొనర్పవలసిన రీతిని నిరూపించినాడు. అంతమున 'కుంభదాసీ, పరిచారికా, కులటా, స్వైరిణీ, నటీ, శిల్పకారికా, ప్రకాశ వినష్టా, రూపాజీవా గణికా చేతి వేశ్యా విశేషాః (7.6.57) అని అందలి విభేదములను నిరూపించి వేశ్యలు అర్థ ప్రయోజనలుగాని, రతి ప్రయోజనలు గారనీ నిశ్చయించినారు. పణ్యజీవనము ఒకనాడు వచ్చినది కాదు. వివాహవిచ్ఛేదకమును కాదు. దీనిని గూర్చి ఎల్లిస్ మహాశయుడు “The History of the rise and development of prostitution enables us to see that prostitution is not an accident of our Marriage system, but an essential constituent which appears with its other concurrently essential constituents" అని చెప్పి ఉన్నాడు. ఇట్టి దృష్టి వాత్స్యాయనాది ప్రాచీన కామశాస్త్రవేత్తల కున్నట్లు గోచరింపదు. కాంతాను వృత్తాద్యధ్యాయమున పణ్యస్త్రీల కామలక్షణములను గూర్చి ప్రశ్నించుకొని మహర్షి 'సూక్ష్మత్వా దతి లోభాశ్చ ప్రకృత్యా జ్ఞానత స్తథా, కామలక్ష్మతు దుర్ ఙ్ఞానం స్త్రీణాం తద్భావితై రపి' ఇత్యాదిగ పలికినాడు. కాని నేటి జాతిశాస్త్రవేత్తలు (Sexologists), మానసిక శాస్త్ర వేత్తలు పణ్యస్త్రీ కామమును గూర్చి 'It is not from any innate wish of their own, but from necessity that most women enter this profession, indeed, psychological investigation has shown that, far from being over sexed, the majority of prostitutes are under-sexed. Many of them are even homosexual, with no feeling whatever for men' అని చెప్పుచున్నారు.


ఔపనిషదికము తరువాత అధికరణము. స్త్రీ పురుష సుఖానుభూతి కేవల మానసికమే కాదు; శారీరకమును. ఇందు తన్మూలమున శారీరక లోపముల తీర్చుటకై వశీకరణ, వశ్యయోగ, వాజీకరణ వర్ధనాది యోగములు చెప్పినాడు. 'పురుషునికి


సంస్కృతి

159