పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధ్యాయమున దూతీకర్మమూలమున అభియోగము నెరపుట నిరూపితమైనది. దూతీకర్మాధ్యాయమున దూతీలక్షణమున్నది. వాత్స్యాయనుడు 'దర్శితేంగి తాకారాంతు ప్రవిరళ దర్శనా మపూర్వాం చ దూత్యోప స్పర్శయేత్' (5.5.1) అను వాక్యమున దూతి ఉపయోగమును జెప్పి 1. నికృష్ణార్థ 2. పరిమితార్థ 3. పత్రహారి అనుదూతికల విభేదమును పలికినాడు. భార్యాదూతీత్వ మిందు గమనింపదగినది. ఈమె ఎందు నిమిత్తము దూత్యమొనర్చుచున్నదో ఎరుగని ముగ్ధురాలు, మూఢదూతిక.


తదుపరి అధ్యాయము ఈశ్వర కామితము. ఇందు ప్రభువుల పరదారాభిగమనము నిరూపితము. 'సత్వేవం పరభవన మీశ్వర ప్రవిశేత్' (5.5.29) అని వాత్స్యాయ నాభిమతమును నిర్దేశించినాడు. తదుపరివచ్చు అంతఃపురికాప్రకరణమున నీ సూత్రమును సమన్వయ మొనర్చి వీరికిని పరభవన ప్రవేశము పనికిరాదనినాడు. ఇందలి రెండవ మూడవ సూత్రమున అంతః పురికలు అపద్రవ్యముల మూలమునగాని అవ్యక్త లింగముల మూలమున గాని, లేక పురుష ప్రతిమల మూలమున గాని అభిలాషము తీర్చుకొన వలెనని చెప్పినాడు. (9,9.2-4) ఈ ప్రకరణమున చెప్పిన 'స్వైరేవ పుత్రై రంతః పురాణి కామచారై ర్జననీవర్ణ ముపయుజ్యంతే వైదర్భి కాణాం’ (5.6.36) అనుసూత్రము వలన నాత్మబంధు ప్రణయము (INCEST) అంతఃపుర స్త్రీల కున్నట్లు తెలియుచున్నది. ఇట స్త్రీవినాశ కారణములను 'అతిగోష్ఠీ నిరంకుశతా భర్తు స్వైరతా పురుషైస్సహా నియంత్రణతా ప్రవాసేవస్థానం విదేశే నివాసః స్వవృత్త్యుప ఘాతః స్వైరిణీ సంసర్గః పత్యుతీర్యాళతా చేతి స్త్రీణాం వినాశ కారణాని' (5.6.49) అను సూత్రమును పలికినాడు.


అతి ప్రాచీన కాలముననే భారతదేశమున నన్యదేశములందువలె పణ్యవృత్తి (వేశ్యావృత్తి) ఏర్పడినది. ఇందు ఉత్తమలు గణికలు. అత్యుత్తమ నాగరికత వ్యాపించిన ఆ కాలముల నాగరకులు భార్యలలో లుప్తమగు భోగమును భోగస్త్రీలయందు (Femmes De joie) పొందెడివారు. అందువలన సాంఘిక వ్యవస్థలో వారికున్నత స్థానము ప్రాపించినది. అందువలననే గణికకళా ప్రావీణ్య లక్షణమును విద్యాసముద్దే శాధ్యాయమున వాత్స్యాయనుడు నిరూపించినాడు. వీరికి సంబంధించిన కామమును ఆయన వైశికమున నిరూపించినాడు. కొందరు, మహర్షి భార్యాధికరణమును వదలి కేవలము పారదారికమునకు విశేష ప్రాధాన్య మిచ్చినారు. కల్యాణమల్లుడు వేశ్యా ప్రకరణమును వదలినాడు. కొందరు శాస్త్రకారులు కేవలము వేశ్యయే నాయిక యైనట్లు గ్రంథరచన మొనర్చినారు.


158

వావిలాల సోమయాజులు సాహిత్యం-4