పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరణ యోగ్యయగు కన్యక లక్షణములను చెప్పు సందర్భమున నున్న వాత్స్యాయనుని సూత్రమున (3.1.2) 'త్రివర్షాత్ప్రభృతి న్యూనవయసం' అను దానిని గమనింపవలసి ఉన్నది. " మిగిలిన లక్షణములన్నియు నన్నిజాతులవారు నంగీకరించునవియే. ఇట పౌరుష దైవములను వరణద్వితయమును వాత్స్యాయనుడు పలికినాడు. 'తస్యాః వరణే మాతా పితరౌ సంబంధినశ్చ ప్రయతేరన్మిత్త్రణిచ గృహీత వాక్యాని ఉభయ సంబద్ధాని' (3.1.4) అను సూత్రమును బట్టి వరించునది. నాయకుడొక్కడే కాదని తెలియుచున్నది. 'నక్షత్రాఖ్యం నదీనామ్నీం, వృక్ష నామ్నీం చ గర్హితాం, లకార రేఖోపేతాం చ వరణే పరివర్జయేత్' అను సూత్రమున అశ్వని, రోహిణి ఇత్యాది నక్షత్రనామములను, గంగా యమునా కావేరి మొదలైన నదీ నామములు, మాలతీ కదంబ పారిజాత ప్రభృతి వృక్షలతా నామములు గల కన్యకలను వరింపరాదని వాత్స్యాయన మతము. దీనికిని మానసిక వృత్తికిని కొంత సంబంధముండి యుండవలయును. తదుపరి ఆయా దేశ లక్షణముల ననుసరించి వివాహము చేయవలసినదని 'దేశ ప్రవృత్తి సాత్మ్యా ద్వా బ్రాహ్మ ప్రాజాపత్యార్ష దైవానామన్యత మేన వివాహేన శాస్త్రతః పరిణయే దితివరణవిధానమ్' (2.1.21) అని సూత్రీకరించి ఈ అధ్యాయము ముగించినాడు.


కన్యా విస్రంభణమున ఉపాయ పూర్వకముగ నాయికను విశ్వసింప జేయుట నిరూపితమైనది. వివాహపూర్వ ప్రణయము భారతదేశమున లేకపోవుటవలన నీ విస్రంభణము కామశాస్త్రమున చెప్పవలసి వచ్చినది. " కన్యావిస్రంభణ మెరుగని వారివలన జాతులు రోగగ్రస్తములగుచున్నవి. తదుపరి వచ్చు బాల్యోపక్రమ ఏకపురుషాభి యోగాద్యధ్యాయముల కన్యక బాహ్య అంతర రతిసుఖమునకు ఎట్టివానిని స్వీకరింపవలయునో మహర్షి నిరూపించినాడు. తదుపరి వచ్చు వివాహాధ్యాయమున నష్టవిధ వివాహ స్వరూపమును తెల్పి అంతమున 'సుఖత్వాదబహు క్లేశాదపిచా వరణా దిహ అనురాగా దాత్మ కత్వాచ్ఛ గాంధర్వ ప్రవరో మతః' (3.5.80) అను గాంధర్వ వివాహా (Romantic Marriage) ధిక్యమును నిరూపించినాడు.

భార్యాధికరణము ఒక రీతిగ కన్యాసంప్రయుక్తమునకు పరిశిష్టము. 'భర్తతు దేవతా స్త్రీణాం' అను న్యాయమున భార్య మెలగవలసిన రీతిని గృహకర్తవ్యములను నిరూపించి “జ్ఞాతి కులస్యా నభిగమన మన్యత్ర వ్యసనోత్సవాభ్యాం' (4.1.44) మొదలైన నీతులనెన్నిటినో వాత్స్యాయను డుపదేశించినాడు. ఈ ప్రకరణమున నాటి సాంఘిక స్థితి గృహిణి ఎట్టి ఉన్నతస్థితి ననుభవించునో తెలియగలదు. మనువు భార్యను


156

వావిలాల సోమయాజులు సాహిత్యం-4