Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాటదేశ స్త్రీల పోలినవారే అపరాంతవాసులని వాత్స్యాయనుని అభిప్రాయము. వారికి బాహ్యరతి, సంప్రయోగముల వెంటను ప్రీతి కలదని కొక్కోకుడనినాడు. సింధు స్త్రీలు ఔపరిష్టక ప్రియలనినాడు. వారికి ఔపరిష్ట కాద్యము కాని రతమున తృప్తి లేదనినాడు. జలంధర దేశ స్త్రీలకు ప్రయోగవిధాన వైచిత్య్రములన్న (Sexual Movements) (కామసూత్రములు, ద్వితీయాధికరణము, అష్టమాధ్యాయమున వర్ణితములు) ఆసక్తి అధికమని పద్మశ్రీ అభిప్రాయము. ద్రావిడ స్త్రీలకు శుక్రక్షరణము రతారంభమునుండి కలుగుననియును అందువలన ప్రథమ రతముననే తృప్తలగుదురని వాత్స్యాయన కొక్కోకుల మతము. పద్మశ్రీ వీరికి కరతాడన, మర్దన, ఔపరిష్టకాది ప్రీతి కలదని చెప్పుచున్నాడు. కాశ్మీరస్త్రీ గంధప్రియ అని పద్మశ్రీ. ఇతర గ్రంథములు కానరాని అనేక దేశస్త్రీల సాత్మ్యములను నాగరసర్వస్వకర్త నిరూపించినాడు. ఈ అధ్యాయాంతరమున సూత్రకర్త దేశ సాత్మ్య ప్రకృతి సాత్యముల ప్రయోగ విధానమును గుర్తించి 'దేశసాత్మ్యాతృకృతి సాత్మ్యం బలీయ ఇతి సువర్ణ నాభో నతత్ర దేశ్యా ఉపచారాః' (2.5.34) అని నిశ్చయించినాడు. తుది సూత్రముగ చెప్పిన 'పరస్పరాను కూల్యేన తదేవం లజ్జమానయోః సంవత్సర శతేనాపి ప్రీతిర్నపరిహీయతే' అను వాక్యమెంతయో సమంజసమైనది. వీనిని గుర్తింపక పోవుట వలననే భారతదేశమున ప్రీతిరహిత వివాహ ధర్మములును, పాశ్చాత్య లోకములందు వివాహ విచ్ఛేదనములును జరుగుటయును, కలుగుటయును.


సంవేశన చిత్రరతములు (MODUS SEXUALIS) : దేశప్రకృతి సాత్మ్యా పేక్షయా ఆలింగనా ద్యుపచారముల మూలమున పరస్పరము అనురాగము కల్గిన నాయికానాయకులు సంవేశమునకు అర్హులయ్యెదరని పూర్వాధ్యాయమున స్థాపించిన తదనంతరము మహర్షి వాత్స్యాయనుడు సంవేశన ప్రకారమును, తదంతర్గతములైన చిత్రరతములను నిరూపించినాడు.


ప్రాచీన అర్వాచీన ప్రపంచములో రతిబంధ విభేదములు విశేషముగ కనుపించుచున్నవి. ఇవి కొన్ని స్వతః సిద్ధములు. కొన్ని నూతనత్వాపేక్షకులైన దంపతులు కనుగొనినవి. అనేక కారణముల మూలమున సమస్త కాలములలోను సమస్త దేశ ప్రజలును వీనిని ఆదరించినారు. క్రీస్తునకు నెంతో పూర్వముననే ఔద్దాలక, శ్వేత కాదులు, భారతావనిలో రతిబంధ విభేదములను గుర్తించి శాస్త్రనిబద్ధములుగ నొనర్చిరి. వాత్స్యాయనుని నాటికి అవి క్రమక్రమముగ నలువది ఎనిమిదిగ సంగ్రహితములైనవి. ప్రాచీన భారతము నాటికి సంబంధించిన విజ్ఞానము విశేషముగ నుండుట వలన నివి సాహిత్యశాస్త్ర గ్రంథముల కెక్కినవి. '


140

వావిలాల సోమయాజులు సాహిత్యం-4