పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరస్పరానుబద్ధములగు రీతులను వ్యక్తమొనర్చి, శాస్త్రరచనావశ్యకతను నిరూపణ చేసినాడు. ఈ సందర్భమున మహర్షి నాస్తిక లోకాయతాది మత విమర్శన మొనర్చి ధర్మా చరణీయ సిద్ధాంతమును ప్రతిపాదించినాడు. కామమును సేవింపరాదనువారి వాదములు ఖండించు సందర్భమున ప్రతిపక్షులు సూపు అనర్థ జనసంసర్గ అసద్వ్యవసాయ అశౌచ అనార్య అనాయత్యాదులైన దోషములను త్రోసిరాజని 'శరీరస్థితి హేతుత్వాదాహర సధర్మాణోహి కామః' (1.2.46) అని కామమును శరీరస్థితికి హేతుభూతమనియును, ఆహారముతో తుల్యమైనదనియును నిర్ణయించినాడు. అంతేకాదు. 'ఫలభూతాశ్చ ధర్మార్థ యోః' (1.2.47) అని సూత్రీకరించి దానిని ధర్మార్థ సాధకముగ చెప్పియున్నాడు. అజీర్ణము మొదలగు దోషములందు ఏ విధమగు ప్రతీకారము నవలంబింతువో అట్టి ప్రతివిధానమును అవలంబించి కామమును సేవింపవలెననియును, దోషములున్నవని పరిత్యజింపరాదు, అని వాత్స్యాయనుని సిద్ధాంతము.


తదుపరి వచ్చు విద్యాసముద్దేశాధ్యాయమున త్రివర్గమును పొందినవానికి కామసిద్ధి కలుగవలెనన్న ప్రథమోపాయము విద్యాగ్రహణము. అందు మూలమున విద్యాసముద్దేశము మహర్షి పలికినాడు. ధర్మ (శ్రుతి స్మృతులు) అర్థ (వార్తా) విద్యలకు అడ్డురానిరీతిగ కామసూత్రమును తదంగ విద్యయైన చతుష్షష్టితో అధ్యయనము చేయవలెనని ఆయన నియమము." 'ప్రాగ్యౌవనాత్త్స్రీ' (1.2.2) అను సూత్రమున పురుషులవలె స్త్రీలకును అంగసహిత కామవిద్య అధ్యయనమునకు కావలెనట! స్త్రీలకు శాస్త్రములు పఠించు అధికారము లేదనియును, ఒకవేళ పఠించినను గ్రహించు సామర్థ్యము లేదు కావున, శాసించుట నిరర్థకమను పూర్వాచార్యుల మతమును త్రోసిరాజని, వాత్స్యాయనుడు 'ప్రయోగ గ్రహిణం త్వాసామ్. ప్రయోగస్య చ శాస్త్ర పూర్వకత్వాత్' (1.3.5) అని స్త్రీలకు ఈ శాస్త్ర విషయమున ప్రవేశముండవలెనని శాసించుట నిరర్థకము, అనర్థకము కాజాలదని సిద్ధాంత మొనర్చెను. కొందరు స్త్రీలకు శాస్త్ర గ్రహణము కూడ కలదనియును, పురుషులవలె శాస్త్రములను జదివి, తత్పరిశ్రమ మూలమున బుద్ధి సంపాదించిన వేశ్యాజనము, రాజకుమార్తెలు, సామంతపుత్రికలు ఉన్నారనియును నిరూపణ మొనర్చినాడు (1.3.12)


స్త్రీలు కామసూత్రములను ఏకాంతముగ నభ్యసింపవలెనట. వారి కాచార్యత్వము వహింపదగిన వ్యక్తులను వారి గుణగణములను వ్యక్తమొనర్చిన తదుపరి చతుష్షష్టి సంప్రయోగాంత మగుటచే దానిని విపులముగ వివరించి, వేశ్య, రాకొమరిత,


122

వావిలాల సోమయాజులు సాహిత్యం-4