Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదు. అందుకనియే "విపాకాహి శ్వమాంస స్యాపి వైద్య కే కీర్తితా ఇతి తత్కింస్యా భక్షణీయం విచక్షణైః" అని చెప్పినాడు. వైద్య శాస్త్రములు రసవీర్య విపాకములుగ కుక్క మాంసమును చెప్పినను విచక్షణులు భక్షింపని రీతిననే, ఇందును అనుసరింప వలయునని ఆయన అభిప్రాయము. 'బ్రహ్మచర్యమునకు పరమమైన సమాధిచే లోకయాత్ర సుఖముగ సిద్ధించి జగత్కల్యాణము జరుగవలెనని ఈ శాస్త్రము మావలన విహితమైనది' అని -


“తదేత బ్రహ్మచర్యేణ పరేణ చ సమాధినా, విహితం లోకయాత్రాయై నరాగార్థీస్స సంవిధిః" అను శ్లోకమున విస్పష్టముగ పలుకుటచే మహర్షి ఆర్ష హృదయము అభివ్యక్తమగుచున్నది.


మహర్షి జ్ఞాన విజ్ఞానములపారములు. ఈ రెంటి సమ్మేళనమూలమున త్రివర్గ ప్రతిపత్త్వాధ్యాయమున ధర్మార్థకామ స్వరూప నిర్ణయ మొనర్చినాడు. ఇతనికి స్మృతి, పురాణేతిహాస పరిచయమున్నట్లు అనేక సూత్రములు ప్రమాణము నొసగుచున్నవి. చతుష్షష్టి, నామము - ఏ రీతిగ ఏ శాస్త్రమునకు ఒప్పునది నిర్ణయమొనర్చు సందర్భమున 'ఋచాం దశత్రయీనాం చ సంజ్ఞతత్వా ది హాపి తదర సంబంధాత్... (2-2-4) అని చెప్పుట వలన వైదిక విజ్ఞానము వెల్లడియగుచున్నది. పతంజలి మహాభాష్య పరిజ్ఞానమున్నట్లు ఆయన సూత్ర రచనావిధానము చెప్పక చెప్పుచున్నది. చార్వాకాది నాస్తిక తత్త్వములు ఆయన గ్రహించినట్లు త్రివర్గ ప్రతిపత్త్యధ్యాయము వలన తెలియగలదు. న్యాయ, తర్కాది శ్రుత్యంగ పరిజ్ఞానము సర్వేసర్వత్ర ప్రమాణస్వీకరణ సందర్భముల గోచరించుచున్నది. కన్యాసంప్రయుక్తమున వివాహ ప్రకరణమున చేసిన నిర్ణయములు స్మృతి పరిజ్ఞానమును, పారదారికము రాజకీయ పరిజ్ఞానమును వెల్లడి చేయుచున్నవి. విద్యాసముద్దేశాధ్యాయమున - ఆయన కళా పరిజ్ఞానము, నాగరక అనాగరక దేశాచార పరిజ్ఞానము పరిస్ఫుటముగ నిరూపితమైనది. దేశసాత్మ్యముల వెల్లడించు సందర్భమున భౌగోళిక విజ్ఞానమును, ఔపనిషదాధికరణమున వైద్యశాస్త్ర విజ్ఞానమును వ్యక్తమగుచున్నవి. ఇక కామశాస్త్ర పరిజ్ఞానమున నతడేకైక విజ్ఞాని. జగదేక శాస్త్రకారుడు.


సాధారణాధికరణమున శాస్త్ర సంగ్రహాధ్యాయము మొదటిది. అందు ప్రథమమున కామశాస్త్రావతరణ కథనమును విశదీకరించి, వాత్స్యాయనుడు ప్రకరణాధికరణ సముద్దేశ మొనర్చి, సంఖ్యానిర్దేశమును, సూత్రకర్తల సంప్రదాయ విశేషములను పేర్కొనినాడు. ద్వితీయాధ్యాయమైన త్రివర్గ ప్రతిపత్త్యధ్యాయమున ధర్మార్థ కామములు


సంస్కృతి

121