పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూనుకొనినట్లును అర్థమగుచున్నది. అందువలన నితని వ్యాఖ్యానము సమగ్రమును ప్రామాణికమునునని మన మంగీకరింపవచ్చును. సూత్ర హృదయము నెఱిగినట్లు వ్యాఖ్యానించు పట్ల నితని కామకళా విజ్ఞానము, తదితర శాస్త్ర విజ్ఞానము సర్వేసర్వత్ర గోచరించుచుండును. ఇతనికి కామకళ స్వానుభవ పూర్వకమైనట్లు గద్యలో చెప్పుకొనిన 'విదగ్ధాంగనా విరహకాతర' శబ్దము వలన మన కర్థమగుచున్నది. క్రీ.శ. 1577లో వీరభద్రుడు 'కందర్ప చూడామణి' అనుపేర ఆర్యావృత్తములలో కామసూత్రములకు వేరొక వ్యాఖ్యానము జెప్పినాడు. క్రీ.శ. 1789లో సర్వేశ్వరశాస్త్రి శిష్యుడును కాశీనివాసియు నైన ఆంధ్రుడు భాస్కర నృసింహుడు రాజా ప్రజలాల్ అనువాని ప్రోత్సాహమున వాత్స్యాయనీయమునకు ఒక వృత్తిని వ్రాసినాడు. అఖిల ప్రౌఢక్రియయైన వృత్తిని రచింపబూనినట్లు గ్రంథారంభమున చెప్పుకొనిన శ్లోకమునందున్నది. వాత్స్యాయన సూత్ర వ్యాఖ్యాతలలో మల్లదేవుడొకడు. ఇతనిని పంచసాయక కర్త జ్యోతీశ్వరాచార్యుడు మూలదేవుడని వ్యవహరించినాడు. క్షేమేంద్రమహాకవి ఔచిత్య విచారచర్చయను అతని గ్రంథమున నొక వాత్స్యాయన సూత్రసారమును పేర్కొనినాడు. కాని నేడది లభించుట లేదు.

భాస్కర నృసింహుడు కామసూత్ర వృత్తిని ఆరంభించుచు ‘వత్సోపరి వాత్సల్యా వాత్స్యాయనీయ కామసూత్రం యః' అనినాడు. దీని కుపోద్బలకముగ వత్సరాజు వాత్స్యాయనుల మైత్రి కనుగుణములైన జనశ్రుతులున్నవి. మల్లనాగు డను ఆచార్యుడు వత్సదేశ పరిపాలకుడైన వత్సరాజుకు మిత్రుడై, అతని కుమారుడు లోకతంత్ర మెరుగని వాడగుటచే ప్రభువు పరితపింప, నాతడు కనికరించి ఈ కామసూత్రములను చెప్పినాడట! దీనికి ప్రమాణముగ 'మల్లనాగ ప్రబోధితో వత్సేశ్వర ఇవ' అను వాక్యములు ఉదాహృతములైనవి. ఇందలి సత్యాసత్యము లెట్లున్నను 'వాత్స్యాయన' శబ్దము బిరుదనామము. అయిన కామసూత్ర కర్త పేరేమి?

యాదవ ప్రకాశ హేమచంద్రులు వాత్స్యాయన శబ్దమునకు క్రింది శ్లోకముల పర్యాయ పదముల నిచ్చి ఉన్నారు.

“వాత్స్యాయనస్తు కౌటిల్యో విష్ణుగుప్తో వరాణకః ద్రమిళః పక్షిల స్వామీ మల్ల నాగోంగులోపి చ;

వాత్స్యాయనో మల్లనాగః కౌటిల్యశ్చ కాత్మజః, ద్రామిళః పక్షిల స్వామీ విష్ణుగుప్తోంగుళశ్చ సః


118

వావిలాల సోమయాజులు సాహిత్యం-4