(శ్రీమద్రామాయణము నాంధ్రీకరించిన వాడు) శృంగార పరాకాష్ఠను పొందిన బ్రహ్మానంద శతకమును వ్రాసి యున్నాడు. ఇంకను ఆంధ్రమున ననేకములైన చిల్లర గ్రంథములున్నవి.
ఉపలబ్ధ మానములగు సమస్త భారతీయ కామకళాగ్రంథ పరంపరలోను, అతి
ప్రాచీనమును, ప్రామాణికమును అయిన గ్రంథము వాత్స్యాయన మహర్షి
కామసూత్రములు. ఈ గ్రంథమునకున్న సమగ్రస్ఫూర్తిగాని, ప్రాగల్భ్య ప్రాశస్త్యములుగాని
అన్యగ్రంథములకు లేవు. సమస్త కామకళా గ్రంథములకును నిదియే ఆదిభిక్ష వెట్టినది;
అన్నియును దీని ననుసరించినవి అని ఘంటాపథముగ చెప్పవచ్చును. వాత్స్యాయనుడు
పూర్వాచార్యులను కొందరిని పేర్కొని వారి మతములను విమర్శించుట వలన నితడు
శాస్త్ర సంధాతయే గాని స్వతంత్ర రచయిత కాడని ఒక అభిప్రాయమున్నది. ఇది
ఎంతయు సత్యదూరము. మన పూర్వులు ఇతనిని మహర్షిగ భావించినారు. ఇతడు
కామకళాద్రష్ట, స్రష్ట, ఇతని కామసూత్రములను అవలోడన మొనర్చి ప్రపంచములోని
ఉత్తమజాతి శాస్త్రవేత్తలును, కామశాస్త్ర వేత్తలును (Sex and Erotic Scholars) ఇతని
'కామశాస్త్ర విజ్ఞానమునకు బుద్ధినైశిత్యముతో రాజ్యతంత్రమును నడపి శాస్త్రరచన
మొనర్చిన విశిష్ట పాశ్చాత్య రాజకీయవేత్త - మేకవెల్లీ' అని ప్రశంసించినారు.
మన ప్రాచీన సాహితీపరులు కామసూత్రములకు విశేష గౌరవమిచ్చినట్టు
సంస్కృత కావ్యపఠనము వలన వ్యక్తమగుచున్నది. మల్లినాథాది వ్యాఖ్యాతలమాట
అటుంచినను, మహాకవులు కాళిదాసు, భవభూతి, ఆచార్య దండి, ప్రభృతులు వారి
కావ్యములందు సందర్భానుసారముగ వాత్స్యాయన కామసూత్రములను
అనువదించినారు. వరాహ మిహిరాచార్యులవారును కొన్ని సందర్భములందు ఈ
గ్రంథమునుండి ఉదాహరణములను గ్రహించినారు.
వాత్స్యాయనుని 'కామసూత్రములు' నేటికి ప్రపంచములోని 160 భాషలలోనికి
వ్యాఖ్యాన టిప్పణి సహితముగ అనువదితములైనవి. దీనికి 11 ఆంగ్లానువాదములు,
20 ఫ్రెంచి అనువాదములు, 40 జర్మను అనువాదములు నున్నవి. ఫ్రెంచి వానిలో
నుత్తమమైనది లామైరీ అనువాదము, రిచ్చర్డు స్కిమిడ్జ్ హైమన్, స్టీఫెనుల
అనువాదములు జర్మను పరివర్తనములోని కెల్ల ముఖ్యమైనవి. నేటి జాతి శాస్త్రజ్ఞులలో
కామసూత్రములను మెచ్చుకొననివారు లేరు. అతి ప్రాచీన కాలముననే వాత్స్యాయనుని
ప్రభావము అరబ్బు దేశములలో పుట్టిన కామశాస్త్ర గ్రంథములపై బడినది. పూర్వ
రోమక చక్రవర్తులనాటి జాతిశాస్త్రవేత్తలును భారతీయ కామశాస్త్రపు చవిచూచినవారే
116
వావిలాల సోమయాజులు సాహిత్యం-4