Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఘోటకుడు కన్యా సంప్రయుక్తకమును, గోనర్దియుడు భార్యాధికారమును, గోణికాపుత్రుడు పారదారికమును, కౌచుమారుడు ఔపనిషదికమును, పృథక్కరించినారు.


పై సూత్రములందు ఉటంకింపబడిన గ్రంథములు అతి విస్తృతములును అతిదీర్ఘములగుట వలననో, ప్రత్యేకాధికరణములగుటచే సంపూర్ణ జ్ఞానము నొసంగ ప్రత్యేకముగ శక్తిమంతములు కాకపోవుట వలననో, లేక ఉత్సన్నము లగుట వలననో వాత్స్యాయన మహర్షి ప్రత్యేకముగ తంత్రావాపముతో కూడిన కామకళను ఉపాసించి విజ్ఞుడై సంగ్రహ శాస్త్రగ్రంథ రచనమునకు పూనుకొన వలసి వచ్చినది. ప్రాచీన భారతమునందెన్ని అమూల్య కామకళా గ్రంథరచనములు జరిగినను వాత్స్యాయనునికి పూర్వరచనమని చెప్పదగిన దొక్కటియును నేడు మన కుపలభ్యమాన మగుట లేదు. నేడు లభించువానిలో వాత్స్యాయనుని 'కామసూత్రము'లే ప్రాచీనతమ గ్రంథము.


వాత్స్యాయనుని కాలమునాటికే బాభ్రవ్యుని గ్రంథమును సంపాదించుటకే అతికష్టసాధ్యమైన కార్యముగ నుండెడిదట. శ్వేత కేతు, నందికేశ్వరుల గ్రంథములు ప్రాచుర్యములో లేక రూపుమాసిపోయినవి. అందువలననే వాత్స్యాయనుడు సప్తాధికరణ సంక్షేపరూప కామశాస్త్ర గ్రంథ రచనమునకు కడంగ వలసిన వాడయ్యెనని కొందరి అభిప్రాయము.


నందికేశ్వరుడు ప్రమథగణాధిపతి యైన నంది అనియును, మహాదేవ శిష్యుడైన ఈతడు జగత్పితలు పార్వతీపరమేశ్వరులు సృష్టి కార్యమునకు పూనినపుడు కామకళా రహస్యములు వారివలన గ్రహించినాడనియును భారతీయుల విశ్వాసము. మధ్య వైదిక కాలమునుండి మాత్రమే కామశాస్త్ర విజ్ఞానము ప్రచలితముగ నున్నట్లు కన్పించుటచే నందికేశ్వరుడు కేవలము పౌరాణిక వ్యక్తి యని భావించుట కంటె మానవునివలె జన్మించి శాస్త్రగ్రంథ రచన మొనర్చిన వానివలె పరిగణించుట యుక్తమని ఒక విజ్ఞుని అభిప్రాయము


ఔద్దాలకి శ్వేతకేతువు చరిత్రాత్మక వ్యక్తి. ఇతడు అరుణుని మనుమడు. కేకయ మహారాజు అశ్వపతికిని ఇతనికి జరిగిన వాకో వాక్యములు ఛాందోగ్యమున కనుపించు చున్నవి. ‘ ఇతడు పాంచాలదేశమున కేగి పంచాగ్ని విద్యను గూర్చి ఒకానొక పరిషత్తులో ప్రసంగించినట్లు ఆ ఉపనిషత్తు వలన తెలియుచున్నది. బృహదారణ్యకోపనిషత్తున ఒక శ్వేత కేతువు కన్పించుచున్నాడు. మహాభారతమున ఉద్దాలక మహర్షి కుమారుడైన ఒక శ్వేత కేతువు ప్రశంస ఉన్నది. అందు ఇతనిని గూర్చిన ఒక కథనము కనిపించుచున్నది. ____________________________________________________________________________________________________

సంస్కృతి

111