నవమణి
మాతృశ్రీ మాణిక్యాంబిక పవిత్ర స్మృతికి
తే. ఏడుపే నీకు నేనాఁడు తోడు కాఁగఁ
బదియు నార్నెల లేనియుఁ బైనఁబడని
నన్ను నీ చేత నిడి చనినాఁడు నాన్న
సాకినావు శిక్షించి ప్రశస్తగతిని.
తే. అకట! దారిద్య్ర మొక్కట, వ్యాధి యొకట
బాధ వెట్టఁగ నెట్టులో పడుచు నన్నుఁ
గనుచు జీవించినావు రాక్షసపుఁదమిని
ననుభవించిన దణుమాత్రమేని లేక.
తే. నేనె యన్నను, దమ్ముఁడ నేనె, చెల్లి
యలును నక్కయు నైన నా కైతి వమ్మ
విందరను జూచుకొన్నాఁడ యేను నీలో;
ఈవు లేకున్న నాకు వీ రేరు లేరు.
తే.శబ్దములయర్థ మొక్కింత, చదువనేర్తు
నైన నప్పుడు తల్లిప్రేమనిన నేమొ
యెఱుకపడనిది నేఁటి యా రేండ్లలోన
నెన్ని రూపాలతోఁ దోఁచి నన్నుఁ గలఁచె.
తే.లోకమున కేమి కాకులమూఁక కాదె?
ప్రథలఁ గల్పించే మఱచె నిన్ పరమచరిత !
యెఱుఁగు దేగతి భక్తి సేవించినామొ
యీవు లేని లోపాన మా కెంత దిగులొ!
11