Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంటోనీ  : ఉత్తమ మిత్రులారా! ప్రియ స్నేహితులారా!! నన్ను ఇంతటి విప్లవవాహినిని మేల్కొల్పినవాణ్ణిగా చేయవద్దు. ఉద్రేకపడవద్దు.

ఈ కృత్యాన్ని చేసినవారందరూ గౌరవనీయులు. ఈ పనిని చేయటానికి వ్యక్తిగతాలైన వ్యథలు వారి కేమున్నవో నాకు తెలియదు. వారు విజ్ఞానులు అంతేకాదు గౌరవనీయులు. వారు మనకు తగిన సమాధానాలు చెప్పగలరనే నా నమ్మకం.

మిత్రులారా! నేను మీ హృదయాలను దోచుకోపోవటానికి రాలేదు. బ్రూటస్ మహాశయునివలె నేనేమీ వక్తను కాదు. స్నేహితుణ్ణి గాఢంగా ప్రేమించిన కుటిలవర్తనలేని సూటైన మొరటువాణ్ణి. నాకు బుద్ధిబలం లేదు మాటలు రావు. విలువ లేనివాణ్ణి కార్యాచరణ శూన్యుణ్ణి. చెప్పలేను. ప్రజారక్తాన్ని ఉడుకెత్తించగల ప్రసంగ ప్రావీణ్యం నాకు లేదు. ఇదంతా వారికి తెలుసు. అందువల్లనే సీజర్ను గురించి ప్రసంగించటానికి వారు నాకనుజ్ఞ నిచ్చారు. నేను సూటిగా మాత్రమే మాట్లాడగలను. మీకు తెలిసిన విశేషమే, అయినా చెపుతున్నాను. మీతో నా బదులుగా మాట్లాడమని మధురహృదయుడూ, ప్రియుడూ అయిన సీజర్ మహాశయుని మూగనోళ్ళయిన గాయాలను చూపిస్తున్నాను. కానీ, నేనే బ్రూటస్ నై, బ్రూటసే ఆంటోనీ అయితే ఆ ఆంటోనీ సీజర్ ప్రతి గాయానికి ప్రాణం పోసి ఒక నాలుకిచ్చి పలికించి రోములోని శిలాఖండాల నన్నింటికీ చైతన్యాన్ని కల్పించి తిరుగుబాటు చేయింపగలిగి ఉండేవాడు.

అందరు  : ఇప్పుడు మేమూ విప్లవం చేస్తాం.

ప్రథమపౌరుడు  : బ్రూటస్ గృహాన్ని దగ్ధం చేస్తాం.

ద్వితీయపౌరుడు  : అయితే, పదండి! ద్రోహులను వెదకండి.

ఆంటోనీ  : అయినా, నా మాట వినండి, నన్ను మాట్లాడనివ్వండి.

అందరు  : శాంతించండి. ఆంటోనీ ప్రసంగం వినండి. అత్యుదాత్తుడు ఆంటోనీని వినండి.

ఆంటోనీ  : మిత్రులారా! మీరంతా విషయం ఏమిటో తెలుసుకోకుండా ఏమో చేయటానికి వెళ్లుతున్నారు. సీజర్ మీకు ప్రేమపాత్రుడు ఎందుకైనాడో తెలుసుకున్నారా? అయ్యో! మీకది తెలియదు. ఏమైతేనేం! మీకు నేను దాన్ని తెలియజేస్తాను. మీరు మీ ఉద్రేకంలో నేను చెప్పిన ఇచ్ఛాపత్రాన్ని గురించి మరచిపోయారు.


జూలియస్ సీజర్

93