Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/877

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గలవారు ఊహించి తెలిసికొందురు: మూర్ఖులకు అనుభవించిన గాని అర్థము కాదు' అనుకొనుచు సంపాతి తమ్మునిపై అతనికిగల ప్రేమచే అనుసరించెను.

సూర్యాగ్నికి తాళజాలని అంతవరకును జటాయువు పయనించెను. ఐనను పైకి పోవుట మానలేదు. వేడిమి సహించుచు పైకి పోవుచుండెను. తుదకు రెక్కలు కాలిపోవు స్థితి వచ్చినది.

సంపాతి ఇంతవరకును వెనుక ఉన్నాడు. ఇక చూచుచు ఊరకున్న ప్రయోజనము లేదు. తమ్ముని రెక్కలు కాలిపోవును. అతనిని ఎట్లైన రక్షింపవలయును. సంపాతి వేగమును హెచ్చించి జటాయువు పై కెగసి రెక్కలతో అతనిని కప్పెను.

జటాయువుకు ప్రాణాపద తప్పినది. కాని సంపాతి రెక్కలు సంపూర్ణముగా కాలిపోయినవి. అతడు క్రిందపడుచుండెను. అన్న కూతను జటాయువు వినెను. వేగముగా క్రిందకి దిగివచ్చుచుండెను. 'అన్నా! అన్నా!!' అని దుఃఖముతో కేకలు పెట్టెను. ప్రయోజనము ఏమున్నది? అతివేగముగ దేవతలు నేలపైకి విసరిన మాంసపుముద్దవలె కమిలిపోయిన సంపాతి భూమిమీదకు పడిపోవుచుండెను. జటాయువునకు తన తప్పిదము అర్థమైనది. 'పెద్దవారి మాటలు పెడచెవిని పెట్టరాదు' అని తెలిసివచ్చినది.

సంపాతి ఆకాశమునుండి వింధ్యపర్వతముపై పడెను. దిమ్మరవోయెను. కొంతకాలమునకు అతనికి స్మృతి వచ్చినది. ముక్కుచు మూల్గుచు నలుదిక్కులు అతడు పరికించెను. తమ్ముడు లేడు. అంతయును పరిచితముగాని ప్రదేశము. ఏమియు తోచలేదు.

ఆ సమీపమున నర్మదానది ప్రవహించుచుండెను. ఒక ఋషిపుంగవుడు మధ్యాహ్నస్నానమునకై ఆ నదీతీరమునకు వెడలుచుండెను. సంపాతి మూలుగు ఆ మహర్షికి వినబడెను. కరుణామూర్తి అగు అతడు దగ్గరకు వచ్చి :

"వత్సా! నీవు ఎవ్వడవు? నీ కథ ఏమి? ఇట్టి కష్టము నీకు ఎట్లు సంప్రాప్తము ఐనది?" అని సంపాతిని ప్రశ్నించెను.

అమృతబిందువులు చిలుకరించినట్లు తోచిన ఆ యోగిపుంగవుని మాటలకు సంపాతి హృదయము లేచివచ్చినది. అతడు మహర్షితో తన కథ అంతయు నివేదించెను.