ఆనాడు సూర్యోదయము అతిసుందరముగ ఉండెను. జటాయువు అన్నకంటె ముందు నిద్ర మేల్కొనెను. ఆకాశము అరుణకాంతులతో ప్రకాశించుట అతడు చూచెను. అతనికి చెప్పరాని ఉత్సాహము కలిగినది. రెక్కలు తటతటలాడించి అన్నను మేల్కొల్పెను. సంపాతి కన్నులు తెరచి చూచునప్పటికే జటాయువు ఆకసమునకు ఎగిరెను. సంపాతి ఎప్పటివలె అతని వెంట పరుగెత్త మొదలిడెను.
"జటాయూ! సూర్యోదయమైన కాలేదు. మన ప్రయాణము ఎక్కడికి?" అని సంపాతి తమ్ముని ప్రశ్నించెను. “అన్నా! అటు చూడు. మన పెద్దతాతగారు అనూరులు ఎంతప్రేమతో మనను రమ్మని పిలుచుచున్నారో! త్వరగా రమ్ము! వారిని కలిసికొందుము” అని జటాయువు సమాధానము చెప్పుచు తన వేగమును హెచ్చించెను.
"వెట్టివాడా ! తాతగారిని కలిసికొనుటకా మన ఈ ప్రయాణము? నీవు చిన్నవాడవు ఏమియును తెలియదు. వారికిని మనకును ఎన్ని యోజనముల దూరము ఉన్నదో ఎరుగుదువా? మనము ఇంతకంటె వేగముగా పయనించినను వారిని సంవత్సరమునకు కలిసికొన జాలము. వెనుకకు తిరుగుము. మానస సరోవర ప్రాంతమున మనకు మంచి ఆహారము లభించును” అని సంపాతి తమ్మునితో అనెను.
జటాయువునకు ఆ మాటలు నచ్చలేదు. "అన్నా! నీవు మహాబలశాలివి. కాని ప్రయోజనము ఏమున్నది? నీకు సాహసము లేదు. నీ శక్తిసామర్థ్యములు నాకున్న ఈ నాటికే సప్తలోకములను చూచి వచ్చెడివాడను. అన్నా! తాతగారు మనకు చాలా దగ్గరలో ఉన్నారు. కొంచెము వేగమును హెచ్చింపుము. వారిని కలసికొని ఆశీర్వచనమును పొంది వెంటనే వెనుదిరుగుదము" అని జటాయువు అన్నతో పలికెను.
“భయపెట్టినగాని తమ్ముడు వెనుదిరుగడు” అని సంపాతి తలపోసెను. "జటాయూ! నీ ఉత్సాహము నీదే కాని ముందువెనుకలు ఎరుగవు. మనము తాతగారికడకు వెడలుట అన ఏమో నీకు అర్థము అగుట లేదు. మిడుత నిప్పుపై ఉరుకుట. తెలిసినదా? మనము కొన్ని యోజనముల దూరమున ఉండగనే సూర్యుని శక్తి సోకి మన రెక్కలు కాలిపోవును. నా మాట వినుము. వెనుదిరుగుము” అని సంపాతి తమ్మునితో స్పష్టముగ పలికెను.
భయపెట్టిన అంతమాత్రమున జటాయువు ఉత్సాహము వీడువాడు కాదు. దిక్కులు మార్మోగునట్లు 'కూ, కూ అని కూతబెట్టుచు ముందుకు సాగిపోవుచుండెను. 'తెలివి