Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/865

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

21 ఆగష్టు 1944న తిరోగమనమున కనుజ్ఞ నొసగినాడు. ఈ తిరోగమనము తాత్కాలికము. నేతాజీ ధైర్య మణుమాత్రము క్షీణించలేదు. తిరోగమన మొనర్చి తిరిగివచ్చిన సైనికులతో నిట్లు పలికి వారికి సంతోష మొనగూర్చినాడు:

“భారత స్వేచ్ఛా సమరమును భారత భూమిలో బ్రవేశించి సాగించినాము. అనేక కష్టములకు లోనై మనసేన పోరాడినది. సన్నాహ మణుమాత్రమే లేక కేవల నైతిక బలముతో బోరాడిన మనల నెదుర్కొన శక్తిమంతము, సర్వ సంపన్నము నైన బ్రిటిష్ సైన్యము లెంత గిజగిజ లాడినవి. మన యుద్యోగుల, సైనికుల వీరకృత్యములు జగద్వినుతికి బాత్రములైనవి.”

ఇట్టి సంతృప్తికర వాక్యముల పలుకుట మహానాయక లక్షణములు!

తిరోగమించిన సైన్యముతో నేతాజీ మాసముదినములు గడిపి వారికి గలిగిన క్షతములను సమస్తమును మాంత్రికునివలె మటుమాయ మొనర్చి నాడు. వైద్యశాలలన్నియు రోగులతో నిండియున్నవి. నానారకములైన రుగ్మతలతో సైన్యము బాధ పడుచున్నది.

ఝాన్సీ దళములోని వీరవనితలు వారి కుపచారము లొనర్చి తేర్చుచున్నారు. వారిపై శత్రు విమానములు దాడులు చేయుచున్నవి. బ్రాణములు దక్కించుకొనుటకు వారు ప్రయత్నించుచున్నారు.

ఇది బ్రతుకుపై నాశవలన గాదు మాతృదేశ సేవా పరత్వమున!

వరద లాగినవి. బ్రిటిష్వారి 14వ సేన ముందుకు సాగి వచ్చుచున్నది. నేతాజీ తిరోగమించి వచ్చిన సైన్యమును మార్చి రంగమున నూతన సైన్యమును జేర్చినాడు. గడచిన యుద్ధముల వలన కొన్ని యనుభవములు కలిగినవి. ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధము పర్యవేక్షింప 26 అక్టోబరు 1944న యుద్ధ సమితి నొకదానిని నేర్పాటు జేసినాడు. సైన్యములకు గావలసిన యాహార పదార్థముల సకాలమున కందింపవలసిన బాధ్యత వారిపై బెట్టినాడు. యుద్ధభూముల బ్రవేశించుటకు ముందు వీరితో నిట్లు ప్రసంగించినాడు:

"భవిష్యత్తును గురించి యొక రమ్య రూపమును బ్రదర్శింప దలపలేదు. శత్రువు సమస్త సన్నాహములతో మనపై బడ సంసిద్ధుడైనాడు. మనమును సన్నాహముల జేకూర్చు కొనుచున్నాము.