Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/856

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాయుద్ధము తప్పదని గట్టిగ నమ్మినాడు. అట్టి సమయము భారత స్వాతంత్య్ర సముపార్జనమునకు యోగ్యమైనదని నమ్మి యాశుభక్షణము నకై వేచి యున్నాడు. అట్టి స్థితిగతులేర్పడినవి. దేశమున సాగుచున్న సమరమునకు సహాయకారిగ సాయుధ విప్లవము కొంత సాగింపవలెనని యూహించి యాయన జర్మనులతో సఖ్య మొనర్చుకొని యుండును.

తూర్పు ఆసియాలో 1942లో మార్చిలో భారత స్వాతంత్య్ర సమితి యేర్పాటైనది. దాని పర్యవేక్షణ క్రింద భారత జాతీయ సైన్యము (ఆజాద్ హింద్ ఫౌజు) దేశవిముక్తికై స్వాతంత్ర్య సమరము సాగింపదలచినది. వారికి సాయ మొనర్పవలసిన జపానువారితో సంబంధ బాంధవ్యములు సక్రమముగ లేవు. అట్టి స్థితిలో వారు జర్మనీనుండి సుబాస్ బాబును తూర్పు ఆసియాకు వచ్చి భారత జాతీయ సైన్యముతో సమరము సాగింపుడని యాహ్వానించినారు.

అఱచేత ప్రాణములతో నత్యపద్రవకరమైన ప్రయాణ మొనర్చి బెర్లిన్ నుండి జర్మను, జపాను జలాంతర్గాములలో బోసుబాబు సింగపూరు జేరినాడు. ఆంగ్లేయ పాలనలో నున్న సముద్రములలో నతని జలాంతర్గాములు నడచినవి. విశ్వాస మాయనను కాపాడినది! దేశభక్తి యాయనచే నట్టి సాహస కృత్య మొనరింపజేసినది!!

1943 జులై 2న దేశీయులకు దర్శన మిచ్చుటకు ముందు ఆయన పినాంగు మీదుగ జపాను ముఖ్య నగరమగు టోకియో కేగి, యా ప్రభుత్వముతో నత్యావశ్యకములగు సంప్రదింపులు జరిపి, సర్వయత్నములును మాతృదేశ స్వాతంత్యమున కనుకూలములని గ్రహించి సింగపూరుకు విచ్చేసినాడు.

4 జులై రంగూన్లో కాఫీభవనములు జనసమ్మర్దముతో గిటగిట లాడిపోవుచున్నవి. బోసుబాబు దర్శనార్ధము విదేశములవారు చైనీయులు, జపానీయులు, మలయావాసులు నితరులు వచ్చినారు. మిత్ర రాజ్యముల పతాకముల మధ్య త్రివర్ణాంచిత భారత పతాకము స్వాతంత్ర్య విదాహము ననాయన్నట్లు కొసలాడించుచున్నది. అలంకృతమైన యున్నత వేదికపై నుదయ భారతమును దిలకించి మందహాస మొనర్చుచున్న మహాత్ముని తైలవర్ణ చిత్రమున్నది. వేదికకు ముందు భారతజాతీయ సైన్యము, వారి వెనుక తూర్పు ఆసియా రాజ్యముల నుండి యా మహాసభకు బ్రతినిధులుగ నచ్చిన భారతీయులు నుపవిష్ణులై యున్నారు.

'ఇంక్విలాబ్ జిందాబాద్', 'మహాత్మాగాంధీకి జై' 'బోసుబాబుకు జై!' యను హర్ష నినాదములతో భవనములు ప్రతిశబ్దించుచున్నవి. మూర్తీభవించిన


856

వావిలాల సోమయాజులు సాహిత్యం-3