Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కానీ సీజర్ యెడ ఇటువంటివి నిష్ప్రయోజనాలు. తీయని ఉపోద్ఘాతాలు, వినమ్రప్రణామాలు, గోమాయువినయాలు మొదలైన ఆచారాలు అల్పబుద్ధులను కరిగించి నిర్ణయాలను మార్చుకొనేటట్లు చేయగలుగుతున్నవి గదా అనే ఉద్దేశంతో ప్రయోగిస్తు న్నట్లున్నావు! వాటికి లొంగే రక్తం సీజర్ శరీరంలో ఉందని భావించి భ్రమపడకు. దీర్ఘంగా ఆలోచించి నిర్ణయించే మీ అన్నను దేశభ్రష్టుణ్ణి చేశాం. అతడికోసం నీవు ఇలా వంగి ప్రణమిల్లుతుంటే నిన్ను నేనడిచే మార్గంలో ఉన్న ఒక గజ్జికుక్కగా అసహ్యించుకుంటాను. అంటే సీజర్ తప్పిదం చెయ్యడనీ, తగిన కారణంలేకుండా అతడు సంతృప్తిని పొందడనీ తెలుసుకో.

మెటిల్లస్  : దేశబహిష్కృతుడైన మా అన్నమీద అభిశంసనాన్ని రద్దు చేయవలసిందని అర్థించటానికి, సీజర్ చెవులకు నా కంఠంకంటే మధురంగా వినిపించే మరో కంఠం ఈ సభలో ఏదీ లేదా?

బ్రూటస్ : సీజర్, నీ హస్తాన్ని చుంబిస్తున్నాను. ఇది నిన్ను స్తోత్రం చేయటానికి కాదు. పబ్లియస్ సింబర్ మీది అభిశంసనాన్ని తక్షణం రద్దుచేసి, అతడికి స్వాతంత్య్ర ప్రదానం చెయ్యటానికి.

సీజర్  : ఏమంటావు బ్రూటస్?

కాషియస్  : సీజర్! క్షమించు. పబ్లియస్ సింబర్ స్వేచ్ఛ కోసం కాషియస్ మీ పాదపర్యంతం వినమ్రుడౌతున్నాడు.

సీజర్  : నేను మీరే అయి ఉంటే కరిగిపోయి చలించేవాణ్ణి. ఇతరుల మనస్సులు కరగటానికి నేను ప్రార్థించేవాణ్ణి అయి ఉన్నట్లయితే ఇతరుల ప్రార్థనలకు నేను కరిగేవాణ్ణి. కానీ నేను ధ్రువతారలా నిశ్చలుణ్ణి. అన్నీ అగ్నిగోళాలే. ప్రకాశవంతాలే. ఆకాశమంతా ఈ అగ్నిగోళాలతోనే అలంకృతమై ఉంటుంది. అయితే, ధ్రువతార సుస్థిరస్థానాన్ని ఆక్రమించగల సామర్థ్యం వీటిలో దేనికీ లేదు. ఇదేరీతిగా ప్రపంచమంతా మానవులతో నిండి ఉంది. వీరు చర్మరక్తోపేతులు, విజ్ఞానవంతులు. అయితేనేం? వీరందరిలో ఎట్టి భయం లేకుండా నిశ్చలంగా తన స్థానాన్ని నిలుపుకుంటున్న ఒక్క వ్యక్తిని నే నెరుగుదును. ఆ వ్యక్తిని నేనే. ఈ విషయంలో, సింబర్ను బహిష్కృతుని చేయటంలో కూడా, నేను అచంచలుడనని నన్ను నిరూపించనివ్వండి.

సిన్నా : సీజర్, ప్రభూ...!

సీజర్  : మీరు ఇక్కడినుంచి వెళ్ళిపొండి, ఒలింపస్" పర్వతాన్ని ఎత్తటానికి యత్నిస్తారు!


జూలియస్ సీజర్

77