సీజర్ : ప్రియమిత్రులారా! లోపలికి రండి. నాతో కలిసి కొంత ద్రాక్షాసవాన్ని సేవిద్దురుగాని. తరువాత మనం ఉత్తమమిత్రుల్లాగా సభాభవనానికి కలిసి వెడదాం.
బ్రూటస్ : (స్వగతం) సీజర్! ఒకలా నటించి మరొకలా ఉండటం బ్రూటస్ ను ఎప్పుడూ బాధపెడుతుంది.
(నిష్క్రమిస్తాడు)
మూడో దృశ్యం
సభాభవనం దగ్గిర ఒక వీథి. ఒక పత్రాన్ని చదువుతూ ఆర్టిమిడోరస్ ప్రవేశిస్తాడు.
ఆర్టిమిడోరస్ : "సీజర్! బ్రూటస్ ను గురించి జాగరూకత వహించు. కాషియస్ ను గమనించు. కాస్కాను దగ్గరకు రానీకు. నిన్నామీద ఒక కన్ను వేసి ఉండు. ట్రెబోనియస్ ను నమ్మకు. మెటిల్లస్ సింబర్ ను బాగా గుర్తుపెట్టుకో. డెషియస్ బ్రూటస్ కు నీ మీద అనురాగం లేదు. కెయస్ లిగారియస్ కు నీవు అపరాధం చేశావు. ఈ వ్యక్తులందరిదీ ఒకటే మనస్సు. అది సీజర్ కు వ్యతిరేకంగా ఉంది. 'నేను దివ్యుడను' అని అనుకోకపోతే నిన్ను గురించి ఆలోచించుకో. భద్రభావం ద్రోహానికి దారితీస్తుంది. బలవంతులైన దేవతలు నిన్ను రక్షింతురుగాక! - భవదీయానురాగి, ఆర్టిమిడోరస్”
సీజర్ ఇటు వెళ్ళేదాకా ఇక్కడే నే నిలిచి ఉంటాను. ఈ పత్రాన్ని ఒక నివేదనగా అతని చేతికి అందజేస్తాను. ఈర్ష్యాళువైన శత్రుత్వపుకోరలనుంచి తప్పించుకొని ఉదాత్తగుణం బ్రతకలేకపోతున్నదని నా హృదయం ఎంతో దుఃఖపడుతున్నది. సీజర్! దీన్ని నీవు చదివితే, విధి ద్రోహులతో సహకరించకుండా ఉంటే నీవు బ్రతకవచ్చు.
(నిష్క్రమిస్తాడు)
నాలుగో దృశ్యం
బ్రూటస్ ఇంటిముందు వీధిలో మరో భాగం.
పోర్షియా, లూషియస్ ప్రవేశిస్తారు.
పోర్షియా : లూషియస్, కాలహరణం చెయ్యకు! సభాభవనానికి పరుగెత్తుకో వెళ్ళు. నాకే సమాధానాలూ చెప్పనవసరం లేదు వెళ్ళు. ఇంక నిలుచున్నావేం? వెళ్లు.
72
వావిలాల సోమయాజులు సాహిత్యం-3