Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/703

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టామ్ మిల్లర్, మార్క్ ట్వైన్, రిచ్చర్డ్ వాట్సన్ గిల్డర్, జాన్ బిగతౌ, జోసస్ జాయట్లు మరణించారు. చార్లీయే యింకా సజీవుడు. ఈ మిత్రు లిరువురూ ప్రతి ఆదివారం ఒకరి కొకరు వుత్తరాలు వ్రాసుకుంటుండేవారు.

ఏప్రిల్ 22, 1919 - నిన్న మొన్నటి వరకూ స్కిబో పర్వతప్రదేశపు కోనల్లో తండ్రి చేయి పట్టుకొని మెల్లగా వెంట వచ్చిన 'చిన్న పిల్ల' మార్గరెట్ను - రోజ్ వెల్ మిల్లర్ అనే మంచి న్యూ యార్క్ యువకిడికిచ్చి వివాహం చేశారు. ఇదే ఆమె తండ్రి యింట జరిగిన చివరి శుభకార్యం.

ఆ వేసగిలో జార్జి లాడర్, జూనియర్ షాడో బ్రూకన్ను చూడటానికి వచ్చాడు. ఇరువురూ కలిసి తీరుబడిగా షికారుకు వెళ్ళారు. చేపలు పట్టారు. చెక్కర్స్ ఆట లెన్నో ఆడారు. చివరకు కజిన్ డాడ్ కూడా “గుడ్ బై” చెప్పి వెళ్ళాడు.

ఆగస్టు మొదట్లో కార్నెగీ న్యూమోనియా వల్ల బాధ పడుతున్నాడు. మిసెస్ కార్నెగీ ఒక విశ్వాసపాత్రుడయిన సేవకుడు, ఒక మారిసన్ వంశీయుడు, మూడువేళలా అతడికి సేవ చేస్తున్నారు. వ్యాధి ఆరంభమైన రెండవ రోజు, ఆదివారం కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం మోర్లకు వ్రాసే ఉత్తరం వ్రాయలేదు. ఆ నాటి సాయంత్రం అతడు చాలా నిస్సత్తువగా వున్నా అతని స్థితి సంతృప్తికరంగానే వున్నట్లు కనిపించింది. రాత్రి సెలవు తీసుకుంటూ, “ఆండ్రూ, నీవు సుఖంగా నిద్రిస్తావని ఆశిస్తున్నా” నన్నది భార్య.

"ఔను, నేను అలాగే ఆశిస్తున్నాను" అని అతడు సమాధానం చెప్పాడు.

అనతి కాలంలోనే గాఢము, ప్రశాంతము అయిన నిద్ర అతన్ని ఆవరించింది. దాని నుంచి తిరిగి మేల్కోలేదు.

న్యూ యార్క్ టారీ టౌనుకు కొంత ఉత్తరంగా వున్న 'స్లీపీ హాల్ సెమెట్రీ'లో వాషింగ్టన్ ఇర్వింగు విశ్రాంతి ప్రదేశానికి అనతిదూరంలో అతన్ని సమాధి చేశారు. అతని సమాధి మీద స్కాచ్ దేశపు నీలశిల (Granite) తో చేసిన ఒక కెల్టిక్ క్రాస్ నిలచి వుంది. స్కిబో ఎస్టేటులో సహచరులుగా వుంటున్న కార్మికులు ఆ గనుల్లో దానిని మలచి త్రోసికొని తెచ్చి పట్టామీదుగా రైలుమార్గం దగ్గరికి చేర్చారు. ఒక గ్లాస్గో కళాకారుడు ఆ క్రాస్ను రూపొందించాడు. మిసెస్ కార్నెగీ దానిమీద చెక్కవలసిన మాటలను నిర్ణయించింది. అది సర్వసాధారణమైన వాఖ్య. ఆడంబరం అణుమాత్రం లేనిది. అంతకంటే ఔచిత్యశోభితమైనది మరొకటి వుండే అవకాశం లేంది.