ప్రభుత్వం వారికి తగ్గ ఏర్పాటు చేసేటంతవరకూ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం ఇందుకు గాను 25,000 డాలర్లు యివ్వనుందని కార్నెగీ సూచన చేశాడు.
ఈ అభిప్రాయం ప్రకటితం కాగానే ప్రజల్లో నుంచి వ్యతిరేకభావం వెలువడ్డది. ప్రభుత్వం స్వీకరింపదగ్గ బాధ్యతను ఒక ప్రత్యేకవ్యక్తి గ్రహించటం అనుచితమని వారన్నారు. ఇలా వారికి సిగ్గును కల్పించి విజయబోధ చెయ్యటమే ఈ పథకంలోని రహస్యం. ఈ చర్యవల్ల ప్రపంచదృష్టిలో దేశం అవమానిత మౌతుందని వారు భయపడ్డారు. అందువల్ల కార్నెగీ మనసులో యిష్టం లేకపోయినప్పటికీ ఈ ఉద్దేశాన్ని కొంత విరమించుకోవలసి వచ్చింది. దీన్ని పూర్తిగా విడిచిపుచ్చకపోవటం మనం మున్ముందు గమనిస్తాము.
1911-12ల శీతకాలం అతడికి ఆ బాల్యమిత్రుడైన టామ్ మిల్లర్ మృతివల్ల అతివేదనతో గడిచిపోయింది. ఇంతకు కొద్ది నెలలకు పూర్వమే అతడు ఆత్మకథలో "అతడు యింకా సజీవుడై వుంటే మిక్కిలి ప్రేమపూర్వకమైన వెలుగును, మాధుర్యాన్ని క్రుమ్మరిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడచినా అతడు ఇంకా యింకా విలువైన మిత్రుడని అనిపిస్తున్నాడు" అని వ్రాశాడు. ఇప్పుడు టామ్ వెళ్ళిపోయినాడు. అందువల్ల మరో వాక్యం చేర్చాడు. "ఇకనుంచీ జీవితానికి ఏదో లోటు తీరని లోటు అతడు నా బాల్యజీవితంలోని సహచరుడు. వృద్ధాప్యంలో అతి ప్రియుడైన మిత్రుడు. అది ఎలాటిదైనా ఇప్పుడత డెక్కడున్నా నేను అక్కడికి వెళ్ళవచ్చునా?”
అతడు తా నేర్పాటు చేసిన అన్ని నిధులను గురించి, సంస్థలను గురించి యెంత గర్వించినా తన దానాల పట్టికలలో కల్లా అతడి కతిప్రియమైంది అతని విరమణ భృత్యపట్టిక (Pension List). ఆర్థిక సహాయార్థం ప్రతి సంవత్సరం అతనికి వేలకొలది లేఖలు వస్తుంటాయి. ఈ ఉత్తరాలు వ్రాసినవారిలో ఎందరు వంచకులో, వారు చెప్పే స్థితిగతులెన్ని కల్పనలో తెలుసుకునే అవకాశం అతడికి సహజంగా లేదు. అయితే ఈ ఉత్తరాల నన్నిటినీ అతడు జాగ్రత్తగా పరిశీలించి, సత్యాలని తోచిన కొన్నిటిని ఎంచి, వాటిమీద “ఇతణ్ణి నెలకు ముప్పదిడాలర్ల మీద వుంచండి”, “ఈ వృద్ధురాలు సుఖంగా జీవించడానికి యే లోపం కలుగకుండా చూడండి" ఈ రీతిగా కార్యదర్శి పొయిన్టన్ వుపయోగార్థం సూచనలు వ్రాస్తుండే వాడు. వృద్ధాప్య జీవన భృతిపట్టికలో చేర్చేవారిలో ఎందరో పూర్వం అతడెరిగిన వాళ్ళు. యౌవనంలోనో, బాల్యంలోనో అతనితో ఏదో విధమైన సంబంధం కలవాళ్ళను చేర్చటం తప్పక జరిగేది.