Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావలసినప్పుడు వస్తుందనీ, అది తమకు అత్యావశ్యకమైన అంతమనీ గమనించకుండా, మానవులు దానికోసం భీతి వహించటమే నాకు అతివిచిత్ర విషయంగా గోచరిస్తున్నది.

(సేవకుడు తిరిగి ప్రవేశిస్తాడు.)

కాలజ్ఞులు ఏమన్నారు?

సేవకుడు  : మీరీనాడు ప్రాసాదాన్ని వదలి ఎక్కడికి వెళ్ళటానికి వారు ఇష్టపడటం లేదు. బలిపశువును విశసనం చేసి చూచినప్పుడు దాని గుండె వారికి కనిపించలేదట!

సీజర్  : తమ భీరుత్వాన్ని చూచుకొని మానవులు సిగ్గు పడటం కోసం దేవతలు ఇలాగే చేస్తుంటారు. భయంవల్ల సీజర్ ఈ నాడు తన ప్రాసాదంలోనే ఉండిపోతే, అతడు గుండె లేని పశువౌతాడు! వీల్లేదు. సీజర్ పశువు కావటానికి వీల్లేదు. అపాయానికి సీజర్ తనకంటే అపాయకరమైనవాడని తెలుసు. నేనూ, ఆ అపాయం ఒకనాడే జన్మించాం. ఇరువురం సింహాలం. మా ఇరువురిలో నేనే పెద్దను. నేనే భయంకరుణ్ణి. సీజర్ వెళ్ళి తీరవలసిందే!

కల్పూర్నియా : ప్రభూ! మీ విశ్వాసం జ్ఞానశక్తిని వినాశం చేస్తున్నది. ఈ నాడు మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు. మిమ్మల్ని మీ భయం కాదు, నా భయం ఆపివేసిందని ప్రకటించండి. మనం మార్క్ ఆంటోనీని సభాభవనానికి పంపుదాం. అతడు మీకు ఈ నాడు శరీరస్వస్థత లేదని నివేదిస్తాడు. ఇదిగో, మీ ముందు మోకరిల్లి వేడుకొంటున్నాను, ఈ విషయంలో నాకు లొంగిపోండి.

సీజర్ : కల్పూర్నియా! నీ ఇష్టాన్ని తీర్చటానికి నేను నా ఇంటివద్దనే ఉండిపోతాను. మార్క్ ఆంటోనీ వెళ్ళి నాకు స్వస్థత లేదని వారికి చెపుతాడు.

(డెషియస్ ప్రవేశిస్తాడు)

అడుగో డెషియస్. అతడు వారికీ విషయం చెపుతాడు.

డెషియస్  : మహోదారపురుషా, సీజర్! శుభం. సుప్రభాతం. నేను మిమ్మల్ని సభాభవనానికి తీసుకోవెళ్ళటానికి వచ్చాను.

సీజర్  : సభాసభ్యులకు నా ఆకాంక్షను తెలియజేయటానికి నీవు సరిగా సమయానికి వచ్చావు. నేను ఈ నాడు సభకు రానని వారితో చెప్పు. రాజాల ననకు అది అబద్ధం. రావటానికి ధైర్యం లేదనకు. అది అంతకంటే అబద్దం. డెషియస్! ఈ నాడు రానని చెప్పు.


జూలియస్ సీజర్

69