ప్రముఖోద్యోగిగా వుండేవాడు. ఐతే శతాబ్ధులు గడచిన తరువాత అది ఒక గౌరవపదవిగా మారిపోయింది. ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎన్నుకొన్న ఒక ప్రముఖవ్యక్తి ఆ పదవిని స్వీకరిస్తుండేవాడు. సెయింటు ఆండ్రూస్ చరిత్రలో గడచిన అయిదు శతాబ్దాలలో ఈ పదవిని నిర్వహించిన విశిష్టవ్యక్తులు సుదీర్ఘ పట్టికలో తాను ఒకడుగా వుండే అవకాశమిచ్చిన ఈ గౌరవానికి కార్నెగీ గర్వించటం ఎంతో సమంజసం. ఈ ఎన్నుకోబడటం విషయంలో ఇతడు బ్రిటిష్ పౌరుడు కానివారిలో ప్రథముడు. తరువాత 1902లో కూడా విద్యార్థులు అతన్ని మరోమారు కూడా ఈ రెక్టర్ పదవికి ఎన్నుకొన్నప్పుడు, అతడు ఇంకా విశేషంగా గర్వించాడు.
రెక్టర్స్ నైట్స్లో అతడు ఎంతో సంతోషించాడు. వీటిలో రెక్టర్ సంపూర్ణంగా విద్యార్థులతో కలిసిమెలసి చరిస్తాడు. ఎంతో ఆదానప్రదానం జరుగుతుంది. వీటిలో ఉండటానికి అధ్యాపకవర్గంలో ఒకడికయినా అనుమతి దొరకదు. మొదటి రెక్టర్స్ నైట్ గడచిన తరువాత, ప్రిన్సిపాల్ డొనాల్డ్సన్ "ఫలానా రెక్టరు మాకు ప్రతిగా మాటాడాడు. మరొక రెక్టర్ మాకు అనుకూలంగా మాటాడాడు. వారిద్దరూ వేదికనుంచే మాటాడారు. రెక్టరు కార్నెగీ చక్రాకారంగా వున్న మా మధ్య కూర్చుని మాతో మాట్లాడారు" అని విద్యార్థులు చెప్పుకొన్నట్లు అతనికి తెలియజేశాడు. సెయింట్ ఆండ్రూస్లో దరిదాపు రెండువందల మంది విద్యార్థులే వుండటం వల్ల, ఇలా చేయటం ఏమంత కష్టమయిన పనికాదు.
ఆబర్డిస్, ఎడింబరో, గ్లాసో, సెయిండ్ మాథ్యూస్ అన్న నాలుగు విశ్వవిద్యాలయాలు ఆర్థికంగా స్తోమత తప్పివున్నవని, శక్తి వుండి కూడా విశ్వవిద్యాలయ విద్యను అనేకులైన బాలురు పొందలేకపోతున్నారనీ గమనించి, కార్నెగీ కోటి డాలర్ల నిధితో స్కాచ్ యూనివర్శిటీ ట్రస్టును ఏర్పాటు చేశాడు. ఇందులో సగభాగం పై నాలుగు సంస్థల ఉపయోగం కోసం, మిగిలిన సగభాగం విద్యార్జనను ఆశించే యువకులకు సహాయం చెయ్యటం కోసం ఉద్దేశింపబడ్డాయి. విశ్వవిద్యాలయ ప్రధానాచార్యులను వారి కుటుం బాలతో వచ్చి ఒక వారం రోజులు గడిసిపోవలసిందని ఆహ్వానించారు. యూనివర్సిటీ ట్రస్టుకు అధ్యక్షుడయిన ఎరల్ ఆప్ ఎల్జిన్, బ్రిటిష్ మంత్రివర్గంలో స్కాట్లండు తరఫున కార్యదర్శి అయిన లార్డు బాల్ఫోర్ కూడా వారు వచ్చినపుడు విచ్చేశారు. తరువాత తరువాత 'ప్రిన్సిపాల్స్ వీక్' అన్నది స్కిబోలో ప్రతి సంవత్సరం జరిగే ఒక వుత్సవమయింది. అది ఎప్పుడూ ఒక సంతోషకరమైన సమయంగా వుంటుండేది.