Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/676

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేసుకుంటూ నడుస్తున్నప్పుడు స్క్వాబ్ విషయాన్ని ఎత్తుకున్నాడు. మొదట అతడు ఏ మాత్రం సుముఖుడుగా లేడు. "కాదు. కాదు విరమించుకోటం నాకు యిష్టం లేదు” అని కళవళ పడుతూ అన్నాడు. ఆ తత్తరపాటు అతడు మనసులో ఒక అంతర్యుద్ధాన్ని సాగిస్తున్నట్లు వెల్లడి చేస్తున్నది. ఇప్పుడు ఆయనను ముట్టడించినవాడు, 'చరిత్రలోకెల్లా ప్రసిద్ధుడయిన సేల్స్మన్' అని సమకాలికుల చేత అనిపించుకొన్న వ్యక్తి. అతని అందానికి తరిమి ఒప్పించే నేర్పునకు దరిదాపుగా తట్టుకోగలగడం అంటూ వుండదు.

"వ్యాపారం పెట్టేందుకు మోర్గన్కు వందలకొద్దీ మిలియన్లున్నాయి. అతడు మనకు చాలా క్లేశకరమయిన ప్రతిద్వంది అయితీరుతాడు. అంతేకాదు, అతడూ, మీరే మడిగితే అది దరిదాపుగా ఇవ్వటానికి సంసిద్ధుడయినాడు" అన్నాడు స్క్వాబ్.

"కావచ్చు. నాకు డబ్బుతో పని లేదు. వ్యాపారం నుంచి బయటకు వెళ్ళి నేను చేసేదేముంది?" అన్నాడు కార్నెగీ అడ్డు చెబుతూ.

"డబ్బును దానం చేస్తూ మహానందాన్ని అనుభవించవచ్చు. మీ ఐశ్వర్య సువార్తను నిరూపించి చూపవచ్చు." ఇలా అతడు యజమాని నిశ్శబ్దంగా వింటూంటే వాక్యపరంపరను క్రుమ్మరించాడు.

చివరకు కార్నెగీ అడిగాడు "దీన్ని గురించి ఇతరభాగస్థుల అభిప్రాయ మేమిటి? మరి, వాళ్ళతో నీవు సంప్రదించావా?"

“మేము ముగ్గురమో, నలుగురమో ఒకరితో ఒకరు ఏదో చెప్పుకున్నాము" అని స్క్వాబ్ ఒప్పుకున్నాడు. “అయితే వాళ్ళంతా అంగీకరిస్తారని నా నిశ్చయం. మాలో ఉక్కు వ్యాపారంలో ఉండిపోదలచుకొన్న వాళ్ళెవరయినా వుంటే, మోర్గన్ రూపొందిస్తున్న ఆ యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్లో స్టాకును, బాండ్లను పుచ్చుకొంటాము. మీరు వెంటనే డబ్బు రూపంలోకి మార్చుకొనేందుకు గాని దానధర్మాల కుపయోగించు కొనేందుకు గాని అనువైన బాండ్లను తీసుకోవచ్చు.”

మధ్యాహ్నమైంది. వాళ్ళు కొద్దిసేపటికి విడిపోబోయేటంతవరకూ కార్నెగీ ఇంకా కొంత మాట్లాడాడు. “ఇతరభాగస్థులను కలుసుకో. వారి అభిప్రాయా లేమిటో తెలుసుకో" అని అతడు ఆదేశించాడు.

ఇతరభాగస్థులందరూ అమ్మకానికి అంగీకరించారు. స్క్వాబ్ ఆ విషయాన్ని మోర్గన్ కు తెలియజేశాడు. అప్పుడు ఆ బ్యాంకరు కార్నెగీని టెలిఫోన్ మీద పిలిచాడు.