Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/672

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్యుద్ధ కాలంనాటి సైన్యంలోని టెలిగ్రాఫర్లంటే కార్నెగీకి ప్రీతి, విశేషం. అతనికి వారితో కొంత లీలగా సంబంధమున్నది. వారు నిర్మించుకొన్నదీ, చారిత్రిక ఖ్యాతిగన్నదీ అయిన సమాజంలో కార్నెగీ ఒకప్పుడు సభ్యుడు. కొన్నిమాట్లు వారి వార్షిక సమావేశాలకు హాజరైనాడు. వార్తాహరి బాలుడుగా వున్న తన తొలినాటి అనుభవాలను గురించి అతడు ఆ సభల్లో ప్రసంగించాడు. సైన్యానికి వీరిసేవ అత్యంత ప్రధానమైంది కనుక, వీరికి కూడా పింఛనులు ఇవ్వాలని ఎంత చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు గనుక, అతనికి కోపం కలిగింది. సైనికుల లాగానే వీళ్ళల్లో చాలామంది యుద్ధభూమిలో ప్రాణాలను కోల్పోయినారు. వికలాంగు లయినారు. గాయాలు తగిలి, వాతావరణం పడక ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నారు. శత్రువుల కారాగారాలలో బంధితులయినారు. వారి దేశప్రభుత్వం దగ్గరనుంచి వారు పుచ్చుకోవలసినంత మొత్తాలు వారికి చెల్లించటానికి వీలు కలిగేటట్లు అతడు 'కార్నెగీ నిధి'ని ఏర్పాటు చేశాడు.

చిత్రమైన చిక్కుల్లో పడ్డ వ్యక్తులమీద కార్నెగీ తప్పనిసరిగా చూపించే దయకు క్రింది దొక ఉదాహరణం మాత్రమే.

మిస్టర్ గ్లాడ్లైన్ ఒకమారు అతనితో అన్నాడు. "మన మిత్రుడు లార్డు ఆక్టన్ ఆర్థిక సముద్రంలో మునిగిపోయే స్థితిలో వున్నాడు. అది నన్ను బాధ పెడుతున్నది. అతడికి ఎంతమంచి గ్రంథాలయముందో నీకు తెలుసు. చూశావు కూడాను. అయితే, దాని విలువ అంతా అతనికి తిరిగి రాకపోయినప్పటికీ దాన్ని విడిచిపెట్టటమంటే దరిదాపుగా అతని గుండె బ్రద్దలయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ, విక్రయిద్దామను కుంటున్నాడు.”

కార్నెగీ "దాన్ని నేను కొంటాను. అయితే...”

గ్లాడ్లైన్ మధ్యలో ఆపి "నన్నొక సూచన చెయ్యనీ. అతని జీవితపర్యంతం దాన్ని అతనిదగ్గరే ఉండనీ. అతని అనంతరం దాన్ని నీవు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యనీయవచ్చు.

ఆ రాజనీతిజ్ఞుడుతో కరచాలనం చేస్తూ "తప్పక చేస్తాను. మీ సూచనకు నా నమస్సులు.”

ఆక్టన్ చెప్పిన ఖరీదుకు అతడు అతని గ్రంథాలయాన్ని కొన్నాడు. అయితే గ్లాడ్లైన్ చెప్పినట్లు ఆ ఉదాత్తుడయిన లార్డ్ బహుకాలం జీవించలేదు. 1902లోని అతడు మృతికి పిమ్మట అనతికాలానికే కార్నెగీ, మోర్లే కలుసుకొన్నారు. కార్నెగీ