ఆ సౌధం కార్నెగీల ఇంటికి ఎందరు అతిథులు వచ్చినా ఒక్కమాటుగానే ఆతిథ్యమివ్వటానికి తగినంత విశాలంగా వుంది. అతిథులు అసంఖ్యాకంగా వస్తుండేవారు. వయోవృద్ధులైన మిత్రులు గ్లాడ్లైన్, మేథ్యూ ఆర్నాల్డు వంటివారు వెళ్ళిపోయినారు. తరువాతి తరంవారైన రుడ్డియర్డు కిప్లింగ్, పాడెరివిస్కీ, సర్ ఎడ్వర్డు గ్రే, స్కాబ్, ఉక్కు నిర్మాత సర్ ఛార్లెస్ టెన్నెంట్, ఇలిహురూట్, ఉన్నతవర్గం వారైన ఇంకా ఇతరులు అతిథులుగా వస్తుండేవారు. వారి పూర్వమిత్రులు లార్డు, లేడీ మోర్లే ఋతువుకు రెండు మార్లో మూడు మార్లో వచ్చి వెళ్ళుతుండేవారు. స్కీబోకు పదిమైళ్ళ దూరాన ఉన్న రైలు స్టేషను దగ్గర విక్టోరియా యుగపు తొలిరోజులనాటి నాలుగు గుర్రాల బండి ఒకటి క్రొత్త వార్నీషు మెరుపుతో నీటుగా నిలచి అతిథులకు స్వాగత మిస్తుండేది. ఎర్రకోటు వేసుకొన్న చోదకుడొకడు దాన్ని నడుపుతుండేవాడు. ఇతని లాగానే ఎర్రకోటు తొడిగి బండి వెనక ఎత్తయిన ఆసనంమీద కూర్చొని, 'కాలరి' (Footman) ఒకడు 'శృంగా'న్ని (Horn) ఊదుతుండేవాడు.
స్కిబోయిలర్డ్ అనిపించుకున్న కార్నెగీ వంశవృక్షాన్ని వంశలాంఛనాలను అసహ్యించుకున్నాడు. కాని స్కాచ్ దేశీయులు ధరించే దుస్తులను కొద్ది మార్పులు జేసి 'కార్నెగీ ప్లయిడ్ ' అన్న ఉడుపును రూపొందించుకున్నాడు. చిన్న మార్గరెట్ ఇంట్లో తిరుగుతున్నప్పుడు, తండ్రి చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు, కొండ లెక్కుతున్నప్పుడు, స్కాట్లండు లోని పర్వతప్రాంతీయులు ధరించే రంగురంగుల తార్తాను ధరిస్తుండేవాడు. ఎస్టేటులో పనిచేస్తున్న సేవకులు, శ్రామికులు కూడా దీన్నే ధరిస్తుండేవారు. స్కిబో పరిసరాలలో ఈ గుడ్డను కుటీరాలలోని మగ్గాల మీద చేత్తో నేస్తుండేవారు. అక్కడ స్కాచ్ పనితనానికి విశేష ప్రాముఖ్య మివ్వబడింది. స్కాచ్ గృహపాలకుడు, స్కాచ్ ఉగ్రాణోద్యోగి (Butler), ఒకరో ఇద్దరో స్కాచ్ ఉపసేవకులు. పైపరు కూడా వీరివలె స్కాచ్. ఇతడు ఉదయవేళ మేల్కొల్పుతూ, భోజనసమయాల్లో తన జంత్రంమీద పార్వతేయగీతాలను అటూ ఇటూ తిరుగుతూ వినిపిస్తుండేవాడు. ఇతడు ఆ ప్రదేశంలోని ప్రముఖవ్యక్తులలో ఒకడు. వీళ్ళందరూ చలికాలాలకు ఆ కుటుంబంతో బాటు అమెరికా వెళ్ళేవాళ్ళు. ఆ ఎస్టేటులోని శ్రామికుల ఉద్యోగాల లాగానే వీరివి కూడా జీవితపర్యంతోద్యోగాలు.
జులై నాల్గవ తేదీన ఆ సౌధం మీద బ్రిటిష్ - అమెరికన్ జెండాలు రెండూ ఎగురుతున్నవి. ఈ రీతిగా రెండు జెండాలు కొత్తజెండాను ఎగురవేసేటంతవరకు ఎగిరాయి. ఈ క్రొత్తజెండా తొలుతొలుతగా వచ్చిన అతిథులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.