ఘనంగా జరిపించారు. ఇతరులందరికంటె ఇతడు ఈ జాతి గౌరవాలను విశేషంగా పొందాడు. అవి ఏబది తొమ్మిది. ఈ గౌరవాలను పొందినవారిలో ఇతని తరువాతి వాడు మిస్టర్ గ్లాడ్ స్టన్. ఇతని కబ్బిన ఇట్టి గౌరవాలు పదిహేడు మాత్రమే. ఈ అమెరికన్ ఘన వ్యాపారిని పార్లమెంటుకు ఎన్నుకోవాలన్న వదంతి కూడా ఇంగ్లండులో బయలుదేరింది.
మిస్ విట్ఫీల్డ్ ఇదంతా చూసి భయపడిపోయింది. ముఖ్యంగా ఆమె భీతికి కారణం ఇతడు బ్రిటిష్ పార్లమెంటులో కూర్చోబోతున్నాడని వినటం. చివరకు ఇంత విశేషంగా విస్తృతిని పొందిన అతని జీవితానికి తాను ఉపకరించలేదనే నమ్మకంతో, ఆమె ఒడంబడికను (Engagement) భగ్నం చేసింది.
1886లో క్రెప్సన్ పర్వతశిఖరం మీద ఉన్నప్పుడు కార్నెగీకి టైఫాయిడ్ జ్వరం పట్టుకున్నది. ఆ సమయంలో దుఃఖం అతణ్ని విశేషంగా క్రుంగదీసింది. అతని తల్లి, సోదరుడు ఇరువురూ జబ్బుచేసి మరణించారు. మిసెస్ కార్నెగీ మరణానికి విశేషంగా వృద్ధాప్యం కారణం. కానీ నలభై మూడేళ్ళ వయసులోనే టామ్ చనిపోవటం ఆండ్రూకు అనుకోని ఉపద్రవం. ఈ వార్తను అతనికి తెలియజేసినప్పుడు అతడు ఇక తాను జీవిస్తేనేం మరణిస్తేనేమన్నంత నిస్పృహ చెందాడు. అఖిలప్రపంచంలో అతని కత్యంత ప్రియతములయిన ఇద్దరినీ అతడు కోల్పోయినాడు. ఆ ఇరువురూ అతనికి విలువయిన సలహాదారులు, సహాయకులు. టామ్ కార్నెగీ సంస్థలన్నింటికీ అధ్యక్షుడు. అతనికి కుడిభుజం. అతడు లేకుండా జీవితాన్ని ఎలా సాగించాలో అతనికి అర్థం కాలేదు.
కొంతకాలం అతడు ఎంతగానో క్రుంగిపోయాడు. క్రమంగా అతడు శారీరక మానసిక బలాలను రెంటినీ కొద్దిగా పొందుతున్నాడు. అతడికి మరొక "ప్రియతమయిన వ్యక్తి లూయీ విట్ఫీల్డ్. ఆమెను గురించి మరల మరల వచ్చే మనోభావాలను త్రోసిపుచ్చలేకపోతున్నాడు. బహుశః ఆమె ఇప్పుడు కొంత తేరుకొని లేచి కూర్చోగలిగిన వెంటనే అతడు తమ ఒప్పందాన్ని పునరుద్ధరించవలసిందని కోరుతూ ఒక లేఖ వ్రాశాడు. అతనికి ప్రయాణం చేయగల పరిస్థితి చేకూరింది. అప్పుడు అతనికి వైద్యం చెయ్యటం కోసం ఆహ్వానింపబడ్డ అతి సమర్థుడయిన న్యూ యార్క్ వైద్యుడు డాక్టరు ఎఫ్.ఎస్. డెన్నీ అతణ్ని న్యూ యార్క్ లోని డెన్నీ హోమ్కు తీసుకొనిపోయాడు. అక్కడ ఆ వైద్యుడు, అతని భార్య చూపిన శ్రద్ధ వల్ల అతడు బాగా కోలుకోవడం జరిగింది. మిసెస్ విట్ఫీల్డు అక్కడికి వచ్చి అతని దుఃస్థితిని, దైన్యాన్ని చూసి, పునఃపరిశీలన చేశానని, ఇప్పుడు అతణ్ని వివాహమాడటానికి తన కిష్టమేనని చెప్పింది. ఆమె అతణ్ని