బ్రూటస్ : జయించటం లేదని నీకు అనుమాన మెందుకు కలిగింది? అలాగే చేస్తున్నాను.- ప్రియా, పోర్షియా! నీవు వెళ్ళి శయనించు.
పోర్షియా : సుస్తీగా ఉన్నదంటున్నారు. నిజమైతే గుండీలు లేకుండా ?' ఇలా ఉదయకాలపు చలిగాలిని పీలుస్తారా మరి? మీకే సుస్తీగా ఉంటే సౌఖ్యదాయకమైన శయ్యనుంచి జారుకొని రాత్రివేళ సాహసించి, ఎదుర్కోటానికి తడిగా ఉన్న విషవాయువులను ఆహ్వానించి జాడ్యాన్ని వృద్ధి చేసుకుంటారా?
లేదు. ప్రియా! బ్రూటస్! మిమ్మల్నేదో మానసిక వ్యథ వేధిస్తున్నది. నాకున్న సత్త్వాన్ని బట్టీ, నా స్థానాన్ని బట్టీ అదేమిటో నేను తెలిసికోక తప్పదు. ఇదిగో, మీ ముందు మోకరిల్లుతున్నాను. ఒకనాడు మీరు స్తుతించిన నా సౌందర్యం మీద, సమస్త ప్రణయ ప్రతిజ్ఞల మీద, మన ఇరువురినీ ఏకం చేసిన ఆ మహాప్రతిజ్ఞ మీద ఒట్టుపెట్టి మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీ హృదయభారమేమిటో, ఎవరో ఆరేడుగురు చీకటికి కూడా ఎరుకపడకుండా ముఖాలు కప్పుకొని వచ్చారు, ఈ రాత్రి మీతో గోష్ఠి చేసిన ఆ నారెవరో, మీ అర్ధాంగినైన, నాకు తెలియజెప్పండి.
బ్రూటస్ : ప్రియా, పోర్షియా! మోకరిల్లకు.
పోర్షియా : మీరు ఉదాత్తులైన బ్రూటస్ అయినంతవరకూ నాకు మోకరిల్లవలసిన పని లేదు. మీకు సంబంధించిన రహస్యాలేమో నేను వినకూడదని మన వివాహబంధంలో ఎక్కడైనా ఉందా? మీతో భుజించటానికి, శయనించటానికి, లేదా కొన్ని సందర్భాలలో ప్రసంగించటానికి మాత్రమేనా నేను మీ అర్ధాంగిని? మీ హృదయ బాహ్యభూమిలో మాత్రమే నేను వర్తిస్తున్నాన్నమాట! నేను ఇంతకంటే అధికస్థితి వహించకపోతే పోర్షియా బ్రూటస్ కు ఉంపుడు కత్తె కానీ ధర్మపత్ని కాదు.
బ్రూటస్ : పోర్షియా! నా హృదయంలో ఉన్న వేడినెత్తురు బొట్లల్లా నీవు నాకు ప్రియమైనదానివి. సత్యం వచిస్తున్నాను, నీవు నా గౌరవనీయమైన ధర్మపత్నివి.
పోర్షియా : మీరు పలికేది సత్యమైతే మీ ఈ రహస్యం నాకు తెలిసి ఉండవలసింది కదూ? నేను ఒక స్త్రీనని అంగీకరిస్తాను. కానీ, ప్రభువు బ్రూటస్ కు పత్నినైన స్త్రీని. నేను ఒక స్త్రీనని అంగీకరిస్తాను కానీ ప్రశస్తి కెక్కినదాన్ని, కేటో పుత్రికను. అటువంటి తండ్రికి కుమార్తెనూ, ఇటువంటి భర్తకు భార్యనూ అయిన నన్నే నా జాతి సామాన్యలకంటే ప్రబలను కానని భావిస్తున్నారా?
జూలియస్ సీజర్
65