Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/643

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చూసి క్లోమన్ మహోత్సాహంతో ఇంటికి వచ్చాడు. "డాడ్! వెంటనే ఇక్కడికి వచ్చి నీ విధానాన్ని మాకు చూపించాలి" అని కార్నెగీ అతడికి వ్రాశాడు అతడు వచ్చి అమెరికాలో చిల్లెపు బొగ్గును పరిశుద్ధి చేసే మొట్టమొదటి కర్మాగారాన్ని నిర్మించాడు. ఇందువల్ల కంపెనీలకు ఎన్నో నిలువలు చేకూరాయి. కంపెనీలోని భాగస్థులందరూ “మనం ఇతన్ని తిరిగి ఇంటికి వెళ్ళనీయకూడదు" అని కూడబలుకుకొన్నారు. ఆ కారణం వల్ల లాడర్ అమెరికాలోనే నిలచిపోయినాడు. కార్నెగీ సంస్థలో భాగస్థుడయి చివరకు, మహాధనికుడుగా మరణించాడు.

ఉక్కు సైన్యంలో చేరటానికి డన్ఫర్మ్ న్ ఎంతో మందిని చేకూర్చి యిచ్చింది. "మిస్టర్ కార్నెగీ, మీ బంధువొకడు ఇక్కడ పనిచేస్తున్నాడు. మీకు తెలుసునా?" అని ఒకనాడు కర్మాగారంలో నడుస్తున్నప్పుడు సూపరింటెండెంటు కార్నెగీని హెచ్చరించాడు.

“తెలియదే!" అని అతడు ఆశ్చర్యంతో సమాధానమిచ్చాడు.

"పైగా అతడు సిద్దహస్తుడయిన మంచి యంత్రవేత్త కూడాను. అతడు మీకు జ్ఞాతి అని కొలదికాలం పూర్వం వరకూ నాకు కూడా తెలియదు.”

"అతడితో నేను మాట్లాడవచ్చునా?”

“తప్పక” అని సూపరింటెండెంటు కార్నెగీని ఒక యంత్రం సరిచేస్తున్న యువకుడి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. “ఇదిగో ఇతడే" అని అతడు "టామ్! వీరు మిస్టర్ కార్నెగీ” అని పరిచయం చేశాడు.

"నీ పేరేమిటి?" అని యజమాని ప్రశ్నించాడు.

“థామస్ మారిసన్. మా తండ్రి రాబర్టు" అని యువకుడు సమాధాన మిచ్చాడు.

"ఏమిటి? నా జ్ఞాతి బాబ్!”

“అవును.”

“నీవు ఇక్కడికి రావటం ఎలా జరిగింది?"

“ఇక్కడికి వస్తే మేము బాగుపడగలమని భావించాను.”

'మేము' అన్నమాటను తిరిగి ఉచ్చరించి "ఇంకా నీతో ఉన్నవాళ్ళెవరు?" అని కార్నెగీ ప్రశ్నించాడు.