టామ్ మిల్లర్ ఇతనికి తోడయినాడు. ఇరువురూ కలిసి చిన్ని కార్పొరేషనును స్థాపించారు.
కార్నెగీతో "అండీ! నిన్ను కూడా ఇందులోకి తీసుకు రావాలని నా కోరిక. కాని క్లోమన్ దీనిని భగ్నం చేశాడు. అతడికి నీవంటే భయం. నీవు ఇందులో చేరితే మొత్తం నీ పరం చేసుకొంటావనీ, లేదా నీ పరం చేసుకోవటానికి ప్రయత్నంచేస్తావనీ అతని అభిప్రాయం" అన్నాడు మిల్లర్.
ఆ పరిహాసాంశాన్ని గురించి వాళ్ళు నవ్వుకున్నారు. అప్పుడు వాళ్ళిరువురూ ఎంత త్వరలో ఆండీ ఇనుము వ్యాపారంలో ప్రవేశించనున్నాడో అణుమాత్ర మయినా ఊహించలేదు.
యుద్ధశాఖ ఇరుసులకు, ఫిరంగి బండ్లకు విపరీతంగా ఆర్డరిస్తున్నది. వీటికే హెన్రీ కాకుండా ఇతరమయిన వాటికి కూడా ఆర్డర్లు ఊరికే వచ్చిపడుతున్నవి. ఒకరోజున ఫీప్స్ - (జాన్కు చిన్న తమ్ముడు. ఇతడు తరువాత కొద్ది సంవత్సరాలకు చనిపోయాడు) ఆశపడుతూ “నాకు ఇనుము వ్యాపారంలో ప్రవేశించాలని వుంది. అయితే ఎలా సాధ్యమౌతుందో బోధపడటం లేదు" అన్నాడు.
టామ్ సొగసుగా మీసాలు గుంజుకుంటూ కొద్దిసేపు ఆలోచించాడు. అతనికి హెన్రీ, ఇంకా సరైన వయసు చేకూరనినాడు. ఒకరోజు "నాకు ఒక క్వార్టరు బదులు ఇస్తావా?" అని అన్ననడిగి తెచ్చుకొని, సొంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించుకున్నాడో స్మృతికి వచ్చింది. అన్న ప్రశ్నార్థకంగా తనను చూచినప్పుడు హెన్రీ “ఇది అత్యవసరమయినది” అన్నాడు.
జాన్ ఆ క్వార్టరును సందేహించకుండా ఇచ్చాడు.
మర్నాడు 'డిస్పాచ్' పత్రికలో 'కావలెను' అన్న ప్రకటన కనిపించిది. "ఉత్సాహ వంతుడయిన కుర్రవాడు ఏదైనా పని కోరుతున్నారు” ఏ మాత్రం దాపరికం లేని ఈ చిన్న ప్రకటనకు ఒక వ్యాపారసంస్థ సమాధానమిచ్చింది.
అది అతనికి 'ఎర్రండ్ బాయ్'గా ఉద్యోగమిచ్చింది. తల్లిదండ్రులు ఒప్పుదలతో అతడు బడి విడిచిపెట్టి ఆ పనిలో చేరాడు. ఆనాటినుంచి అతడు ఒక్కరోజును కూడా వృధాగా పోనివ్వలేదు. ప్రస్తుతం అతడు ఒక పౌడరు కంపెనీకి బుక్కీపరుగా పనిచేస్తున్నాడు. ఒకమాటు “వయసు ఇరవయి సంవత్సరాలు, నేను ఇంకా ఎందులోనూ ప్రవేశించలే” దన్నాడు, జీవితమంతా భగ్నమయిన ఒక వృద్ధుడిలా ఆవరించిన నిరాశతో.