Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/623

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెట్టుబడిదారులు, ఎంతో లాభం వస్తుందనుకున్నారు. కానీ ద్రవ్యోల్బణం రావటం వల్లను, యుద్ధసమయం కనుకను ఖరీదులు విరివిగా పెరిగిపోయినవి. వారి ఆదాయవ్యయా పట్టికలో తుది పంక్తిని ఎర్ర సిరాతో వ్రాయవలసి వచ్చింది.. అంటే ఏమీ మిగలలేదన్నమాట! ఈ పరిస్థితిని గమనించి పెన్సిల్వేనియాలోని అధ్యక్షుడు ఎర్గా థామ్సన్, తన సొంత బాధ్యతమీద, కీస్టోన్ కంపెనీకి నష్టం లేకుండా మరికొంత అదనంగా మంజూరు చేయించాడు. అతినిశితమయిన కృతజ్ఞతాదృష్టి గల కార్నెగీ, ఈ కారణం వల్లనే తరువాత పది సంవత్సరాలకు తాను ప్రారంభించిన మొదటి ఉక్కు కర్మాగారానికి మిస్టర్ థామ్సన్ పేరు పెట్టటం జరిగింది.

ఇరవైయో శతాబ్దపు పన్నురేట్లతో పోల్చి చూచుకుంటే దాని తరం చాలా తక్కువే అయినా, అంతర్యుద్ధం తెచ్చిపెట్టిన రాబడి పన్నుపోను 1863లో ఆండ్రూ కార్నెగీ ఆదాయ పట్టిక 47,86,067 డాలర్లు అతని రాబడి అయినట్లు చూపించింది. ఈ మొత్తం ఆశ్చర్యకరమైంది. అందులో ఇది ఇరవై ఏడేళ్ళ యువకుడి ఆదాయం కావటం ఎంతో విశిష్టమైన విషయం. ఇందులో అతనికి డివిషన్ సూపరింటెండెంటుగా వచ్చిన జీతం ఇరవై నాలుగు వందల డాలర్లు మాత్రమే. ఇందులో ఎక్కువ భాగాన్ని అతనికి నూనెమీది పెట్టుబడి తెచ్చిపెట్టింది. అతని స్లీపింగు కార్, కీస్టోన్, ఆడమ్స్ ఎక్స్ప్రెస్ మొదలైన పెట్టుబడులు కూడా తగినంత రాబడిని ఇచ్చాయి. మిగిలిన ఆదాయం అతనికి ఇతరమైన పెట్టుబడులవల్ల వచ్చింది. అతడు నిజంగా "రూపొందుతున్న స్కాచ్వాడు” అయినాడు. ఆ నాటి ఇతని తైలవర్ణచిత్రం పదకొండు సంవత్సరాలకు పూర్వం తీసిన ఛాయాచిత్రపటంలో వలె అదే నిగనిగ గల శాంతమైన ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. అతని జుట్టు కొంచెంగా నల్లబడ్డది. సొగసైన చిన్ని గడ్డం చేకూరింది.

అతని ఆదాయంలో మరొక పద్దు నలభై రెండు వందల యాభై డాలర్లు "క్లోమన్” నుంచి వచ్చింది. ఇది కార్నెగీ ధనసంపత్తిని పెంపొందించిన మరొక వ్యాపారసంస్థ. ఈ సంస్థలోనుంచి వచ్చిన ఆదాయం అతడు తమ్ముడికోసం పెట్టుబడి పెట్టినదాని మీద వచ్చినది.

ఆండ్రూ క్లోమన్ శక్తిమంతుడు. కానీ సుస్థిరచిత్తం కలవాడు. కొంచెం తగాదా మారివాడు. మంచి జర్మన్ మెకానిక్. క్లోమన్కు అలిఘనీలో ఒక ఫౌండరీ వుంది, ఇతని ఇరుసులకు ఎంతో ప్రఖ్యాతి వచ్చింది. యుద్ధం ప్రారంభం కావటం చేత ప్రభుత్వం ఇతడికి చాలా ఆర్డరిచ్చింది. అయితే ఇతడికి తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకొనేటందుకు తగిన వస్తు సంపత్తి, ధనసంపత్తి లేవు.