ఇంటి విషయానికి వస్తే ఆ 1852 వేసగి ఫెడరల్ ప్రభుత్వానికి తృప్తికరంగా లేదు. యుద్ధభూమిలో దానికి చుక్కెదురుగా వుంది. యుద్ధఫలితాన్ని గురించి తీవ్రమైన అనుమానాలు ప్రారంభమయినాయి. స్కాట్లండులో ముఖ్యంగా డన్ఫర్మ్ లైన్లో కూడా అభిప్రాయం దక్షిణానికి అనుకూలంగా వుంది. అది విని కార్నెగీ విస్తుపోయాడు. యూనియన్ అనుసరిస్తున్నది సన్మార్గమని తెలియజెపుతున్న అంకుల్ లాడర్ ఆ ప్రాంతంలో ఒక్కడై నిలువవలసి వచ్చింది.
తిరిగి జబ్బు చేయటం వల్ల ఆండ్రూ, అంకుల్ లాడర్ ఇంట్లో కొన్ని వారాలు గడపవలసి వచ్చింది. వాళ్ళిరువురూ అమెరికన్ వ్యవహారాలను గురించి ఎన్నో చర్చలు చేశారు. ఒకనాడు అంకుల్ అన్నాడు అతనితో - "ఆండ్రూ! నిన్ను శ్రమకరమైంది అడుగుతున్నానని నాకు తెలుసు నేను దాచిపెట్టుకొన్నది తీసుకోపోయి నా కోసం అమెరికాలో పెట్టుబడి పెడితే నేనెంతో సంతోషిస్తాను” అన్నాడు.
ఈ విధంగా తనమీద భారాన్ని పడేసినందుకు ఆండ్రూ చకితుడైనాడు. “అంకుల్, డబ్బును ఏ రూపంలో పెట్టుబడి పెట్టమంటావు?" అని అడిగాడు.
“అది నీకే బాగా తెలుసు" అని సమాధానం వచ్చినది. “అయితే దాన్ని యునైటెడ్ స్టేట్స్ బాండ్లకు వినియోగిస్తే నాకు మరికొంత ఎక్కువ సంతోషం. ఎందువల్ల నంటే ఇటువంటి ఘోరమైన ప్రమాదస్థితిలో ఉన్న సమయంలో కూడా ఇలా అనటం నేనా గణతంత్ర రాజ్యాంగం మీద ఎన్నడూ విశ్వాసాన్ని కోల్పోయినవాడిని కాకపోవటం వల్లనే.”
అంకుల్ కోరినట్లుగా కార్నెగీ కొంతడబ్బును ప్రభుత్వపు బాండ్లలోను, మరికొంత తనతో సంబంధమున్న అనేక వ్యాపారాలలోనూ పెట్టుబడి పెట్టాడు. చివరకు అంకుల్ లాడర్ పెట్టుబడికి మూడురెట్ల ప్రతిఫలం వచ్చింది.
జార్జి, జూనియర్ ఇతరులతో ఎంతో ముక్తసరిగా మాట్లాడే స్వభావం గల స్కాచ్ యువకుడు. మంచి సమర్థుడయిన మెకానికల్ ఇంజినీరు. కెల్విన్ దగ్గర చదువుకున్నాడు. ఆండ్రూను అమెరికన్ వ్యాపారాన్ని గురించి, ఖనిజసంపదను గురించి అతడు అనేక ప్రశ్నలడిగాడు. అమెరికాను చూడాలనీ, అద్భుతమైన ఆ దేశంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనీ అతడికి నిగూఢమయిన అభిలాష వున్నదని ఆండ్రి గమనించాడు.